26-10-2025 10:00:25 PM
* వాటిని ఢీకొట్టి అదుపు తప్పిన బైక్..
* ఇద్దరు కూలీలకు తీవ్ర గాయాలు..
హుస్నాబాద్: నడిరోడ్డుపై ఆరబోసిన వడ్ల కుప్పల కారణంగా జరిగిన ప్రమాదంలో ఇద్దరు కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ఆదివారం సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం బంజారా హిల్స్ తండా సమీపంలో జరిగింది. దూల్మిట్ట మండలం బెక్కల్ పరిధిలోని శివాలితండాకు చెందిన కూలీలు లకావత్ రవి, లకావత్ ఉమా కరీంనగర్ లో పనిచేసేందుకు ఉదయం ఐదున్నర గంటలకు బైక్‌పై బయలుదేరారు. బంజారాహిల్స్ తండా దగ్గర రోడ్డుపై స్థానిక రైతులు ఆరబోసిన వడ్ల కుప్పలను గమనించకుండా రవి బైక్ నడుపుతూ వాటిని ఢీకొట్టాడు.
దీంతో బైక్ అదుపు తప్పి బోల్తా పడింది. రక్తపు గాయాలతో కిందపడి ఉన్న రవి, ఉమాను గమనించిన స్థానికులు 108లో హుస్నాబాద్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన డాక్టర్లు ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం సిద్దిపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి రెఫర్ చేశారు. రైతులు వడ్లను ఆరబోసేటప్పుడు రోడ్డుపై ప్రయాణించే వారి భద్రతను దృష్టిలో ఉంచుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాహనచోదకులు కోరుతున్నారు.