calender_icon.png 22 November, 2025 | 10:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుట్టుగా గోల్డ్ స్మగ్లింగ్!

18-08-2024 12:24:03 AM

ప్రైవేటు బస్సుల్లో లగేజ్ చాంబర్‌లో తరలింపు

‘దొరికితేనే దొంగ’ అన్నట్లు సాగుతున్న దందా

జోరుగా ఆభరణాలు తరలిస్తున్న వ్యాపారులు

పన్ను ఎగవేసి ప్రభుత్వ ఆదాయానికి గండి

సంగారెడ్డి, ఆగస్టు 16 (విజయక్రాంతి): లోక్‌సభ ఎన్నికల సమయంలో ముంబై నుంచి కారులో భారీగా బంగారం హైదరాబాద్‌కు తీసుకవస్తుండగా సంగారెడ్డి జిల్లా చిరాగ్‌పల్లి వద్ద పోలీసుల వాహన తనిఖీల్లో  పట్టుబడింది. ఇటీవల హైదరాబాద్ నుంచి ముంబైకి నాలుగు కిలోల బంగారం తరలిస్తుండగా జహీరాబాద్ మండలంలోని సత్వార్ శివారులో ఓ ధాబా వద్ద పోలీసులకు పట్టుబడింది. రెండు ఘటనల్లోనూ పట్టుబడిన నిందితులు మధ్యప్రదేశ్‌కు చెందిన వారే కావడం గమనార్హం.

ఇలా పోలీసులకు పట్టుబడిన బంగారం కొంతైతే..  ఇక వారి కళ్లుగప్పి ఎంత బంగారం సరిహద్దులు దాటుతుందో చెప్పడానికి అంచనా ల్లేవు. 65వ జాతీయ రహదారి నుంచి వెళ్లే హైదరాబాద్  ముంబై, గోవాకు వెళ్లే, లేదా అక్కడి నుంచి హైదరాబాద్‌కు వచ్చే వందలాది ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో ఈ స్మగ్లింగ్ జరుగుతున్నట్లు తెలిసింది. ముంబై నుంచి నగలు సినిమాలకు నగలు వినియోగిస్తున్నామని కవర్ చేసి హవాలా మార్గంలో  సొమ్ము చేసుకుంటున్నారని తెలుస్తోంది.

రవాణా ఇలా..

హైదరాబాద్ టు ముంబై వెళ్తున్న.. ముంబై  టు హైదరాబాద్‌కు వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లోని లగేజీ చాంబర్‌లో స్మగ్లర్లు గుట్టుచప్పుడు కాకుండా బంగారు ఆభరణాలు తరలిస్తున్నారు. ట్రావెల్స్ బస్సుపై క్యాబిన్‌పై గూడ్స్ బండిళ్లు, స్టేషనరీ విడి భాగాలతో పాటు ఇతర వస్తువులు లోడ్ చేసి తరలిస్తున్నారు. అవి ప్రైవేట్ బస్సులు కావడంతో ప్రయాణికులెవరికీ అననుమా నం రావడం లేదు. తమకు తెలియకుండానే లగేజీ చాంబర్‌లో బ్యాగులు వగైరా పెట్టుకుని, లేదా వీలైత తమతో పాటు బస్సు లోపలే పెట్టుకుని కామ్‌గా ప్రయాణం సాగిస్తున్నారు. ప్రైవేట్ బస్సుల యజమాన్యాలు ప్రయాణికుల నుంచి ప్రయాణ వసూలు చేస్తూనే.. కాసులకు కక్కుర్తి పడి గోల్డ్ స్మగ్లింగ్‌కు పాల్పడుతుండడం గమనార్హం.

65వ జాతీయ రహదారిపై ఇది నిత్యం జరిగే  దందా. ‘దొరికితేనే దొంగ’ అన్న చందాగా దందా తయారైంది. సాధారణంగా బంగా రం రవాణాపై వ్యాపారులు ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఆ పన్ను ఎగ్గొట్టేందుకు వ్యాపారులు ఇలా వక్రమార్గం పడుతున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. అలా కొనుగోలుదారులకు ఒరిజనల్ బిల్లులు ఇవ్వకుండా తెల్లకాగితం మీద అర్థంకాని అంకెలు వేసి బిల్లులు ఇస్తారు. ముంబాయి నుంచి దొడ్డిదారిలో బంగారం తీసుకవస్తున్నారు.

అక్రమ వ్యాపారంతో ప్రభుత్వం ప్రతి ఏడాది కోట్లు ఆదాయం కోల్పోతుంది. పటాన్‌చెరు, బీహెచ్‌ఈఎల్, సంగారెడ్డి, జహీరాబాద్‌కు ప్రతిరోజు ముంబై నుంచి బంగారం అక్రమంగా రవాణా అవుతున్నా.. రవాణా శాఖ అధికారులు చర్యలు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో రవాణాశాఖ ఓవర్ లోడింగ్ వాహనాలు, నిబంధులు అతిక్రమించిన ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలపై కేసులు నమోదు చేసేది. కానీ ఇప్పుడు చూసీచూడనట్లు వ్యవహరిస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి.