22-11-2025 02:13:13 AM
సర్కారు బడుల్లో పూర్తిస్థాయిలో అమలుకాని వైనం
హైదరాబాద్, నవంబర్ 21 (విజయక్రాంతి): రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం విద్య పూర్తి స్థాయిలో అమలుకాక మిథ్యగానే మారుతోంది. గత కేసీఆర్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియాన్ని విడతల వారీగా ప్రవేశపెట్టినప్పటికీ అది వంద శాతం అమల్లోకి రాలేదు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలల వైపే మొగ్గు చూపుతున్నారు.
ఇంగ్లిష్ మీడియంలో 14 లక్షల మందే..
రాష్ట్రంలోని 11 వేలకుపైగా ప్రైవేట్ పాఠశాలల్లో 35.31 లక్షల మంది చదువున్నారు. వీరిలో 35.13 (97.09 శాతం) లక్షల మంది విద్యార్థులు ఇంగ్లిష్ మీడియంలోనే చదువుతున్నారు. మిగిలిన 17,329 (.48 శాతం) మంది మాత్రం తెలుగు మీడియంలో చదువుతున్నారు. అదే 24,997 ప్రభుత్వ పాఠశాలల్లో 12వ తరగతి వరకు చదువుతున్న వారు 19, 30, 336 మంది విద్యార్థులున్నారు.
మేనేజ్‌మెంట్ల వారీగా చూసుకుంటే ప్రభుత్వ, స్థానిక సంస్థల ప్రభుత్వ పాఠశాలల్లోని 16,68,068 మంది విద్యార్థుల్లో ఇంగ్లిష్ మీడియంలో చదువుతున్న విద్యార్థులు 12,47,515 (74.79 శాతం) కాగా, తెలుగు మీడియంలో 3,37,905 (20.26 శాతం) మంది ఉన్నారు. తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ (టీఆర్‌ఈఐఎస్)లో 20,418 మం ది విద్యార్థులు ఇంగ్లిష్ మీడియంలోనే చదువుతున్నారు. మోడల్ స్కూళ్లలో 1,07,494 మంది విద్యార్థులు సైతం ఇంగ్లిష్ మీడియంలోనే చదువుతున్నారు.
కేజీబీవీల్లో 1,32,034 మంది విద్యార్థుల్లో 1,15,603 (87.56 శాతం) మంది ఇంగ్లిష్ మీడియంలో 16,246 (12.3 శాతం) మంది తెలుగు మీడియంలో చదువుతున్నారు. అర్బన్ రెసిడెన్షియల్ బడుల్లోని 2,322 మంది విద్యార్థుల్లో 813 (35.01 శాతం) మంది ఇంగ్లిష్ మీడియంలో 1509 (64.99 శాతం) మంది తెలుగు మీడియంలో చదువుతున్నారు. మొత్తంగా గమనిస్తే 19,30, 336 మంది విద్యార్థుల్లో 14,91,843 (77 శాతం) మంది విద్యార్థులే ఇంగ్లిష్ మీడియం లో చదువుతన్నారు. 80,193 (4.15 శాతం) మంది ఉర్దూ మీడియంలో చదువుతున్నారు.
విడతల వారీగా..
స్కూల్ స్థాయిలో ఇంగ్లిష్ మీడియం చదువులంటే నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ ఆ తర్వాత ఒకటి నుంచి పదో తరగతి. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2022లో కేవలం 1 నుంచి 8వ తరగతి వరకు మాత్రమే అన్ని ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టింది. ఆ తర్వాత విడతల వారీగా పదో తరగతి వరకు అందుబాటులోకి తీసుకొచ్చారు. నర్సరీ నుంచి తరగతులు ప్రవేశ పెట్టాలనే డిమాండ్ తల్లిదండ్రుల నుంచి వస్తుండటంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రీప్రైమరీ తరగతులను ప్రారంభించింది.
అయితే, సమగ్ర శిక్ష నిధులతో ప్రీ ప్రైమరీ తరగతులు అమలవుతున్న బడులు 250, పీఎంశ్రీ పథకం కింద 112, ప్రభుత్వ పాఠశాలలు 1000 కలిపి మొత్తం బడులు 1,362 మాత్రమే ఉన్నాయి. ఈ బడుల్లో చదువుతున్న చిన్నారుల సంఖ్య 8,976 మందే. వీటిల్లో యూకేజీ నుంచే తరగతులు అందుబాటులో ఉన్నాయి. అది కూడా నాలుగేళ్లు నిండిన వారిని మాత్రమే చేర్చుకుంటున్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి కూడా ఇలాగే మరో 4,900 బడుల్లో యూకేజీని అందుబాటులోకి ప్రభుత్వం తీసుకురానుంది.
కానీ, ప్రైవేట్ పాఠశాలల్లో నర్సరీ, ఎల్‌కేజీ విద్య అందుబాటులో ఉంది. దీంతో రెండున్నర, మూడేళ్ల వయస్సులోనే తమ పిల్లలను ప్రైవేట్‌కు తల్లిదండ్రులు పంపిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో పేరుకే ఇంగ్లిష్ మీడియం అనకుండా ఉపాధ్యాయులకు మంచి శిక్షణనిచ్చి తరగతులన్నింటినీ ఇంగ్లిష్‌లోనే చెప్పాలనే డిమాండ్ తల్లిదండ్రుల నుంచి వినిపిస్తోంది. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.