22-11-2025 01:57:28 AM
ముషీరాబాద్, నవంబర్ 21 (విజయక్రాంతి): బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను చట్ట పరంగా ఇవ్వాలని, పార్టీలపరంగా ఇస్తే ఒప్పుకోబోమని, ఆందోళనను ఉధృతం చేస్తామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, బీసీ జేఏసీ చైర్మన్, ఎంపీ ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. స్థానిక సంస్థలలో బీసీలకు చట్టబద్ధంగా 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేష్ ముదిరాజ్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పగుళ్ల సతీష్‌కుమార్, బీసీ ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు జి అనంతయ్య ఆధ్వర్యంలో శుక్రవారం వేలాది మంది బీసీ విద్యార్థులతో భారీ ర్యాలీని చేపట్టి హైదరాబాద్ కలెక్టరేట్‌ను ముట్టడించారు.
ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. బీసీలకు ఇచ్చిన వాగ్ధానం ప్రకారం 42 శాతం రిజర్వేషన్లు చట్టబద్ధంగా ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పార్టీ పరంగా ఇస్తామంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. పార్లమెంటులో ఇండియా కూటమికి 240 మంది ఎంపీలు ఉన్నా పార్లమెంటులో ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 243-డి 6 ప్రకారం స్థానిక సంస్థలోని బీసీ రిజర్వేషన్లు పెంచే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్యాంగ అధికారం ఇచ్చిందన్నారు. అందుకే అసెంబ్లీలో చట్టం చేశారని, ఏమైనా న్యాయపరమైన సమస్యలు వస్తే ఏ కోర్టుకు వెళ్లినా గెలిచే అవకాశం ఉందని చెప్పారు. జనాభా ప్రకారం విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లతో పాటు స్థానిక సంస్థల రిజర్వేషన్లకు కల్పించే సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడానికి రాజ్యాంగ సవరణ జరగాలని డిమాండ్ చేశారు.
ఇందుకోసం అన్ని రాజకీయ పార్టీలు ఏకాభిప్రా యముకు రావాలని విజ్ఞప్తి చేశారు. రిజర్వేషన్ల సమస్యకు ప్రతిసారి వ్యతిరేకంగా కోర్టు తీర్పులు వస్తున్నాయని, దీనికి రాజ్యాంగ బద్ధత కల్పించడమే శాశ్వత పరిష్కార తెలిపారు. ఈ కార్యక్రమంలో సి రాజేందర్, శివ కుమార్, యాదవ్, నిఖిల్ పటేల్, అరవింద్ ప్రీతం జాయ్ తదితరులు పాల్గొన్నారు.