calender_icon.png 22 November, 2025 | 2:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేంద్రానివి బూటకపు ఎన్‌కౌంటర్లు

22-11-2025 02:08:44 AM

  1. సీపీఐ రాష్ర్ట కార్యదర్శి కూనంనేని సాంబశివరావు 
  2. లోయర్ ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద 
  3. వామపక్ష, ప్రజా సంఘాల నిరసన

హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 21 (విజయక్రాంతి): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మావోయిస్టులపై బూటకపు ఎన్‌కౌంటర్లకు పాల్పడుతోందని, మనుషులను ఉచకోత కోస్తుంటే సుప్రీంకోర్టు మౌనంగా ఉండటం బాధాకరమని సీపీఐ రాష్ర్ట కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆవేదన వ్యక్తం చేశారు. బూటకపు ఎన్‌కౌంటర్లపై సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి, సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. బూటకపు ఎన్‌కౌంటర్ల వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులు శుక్రవారం హైదరాబాద్ లోయర్ ట్యాంక్‌బండ్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద మహా నిరసన కార్యక్రమం చేపట్టారు.

ఈ సందర్భంగా కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. ‘ప్రజాధనాన్ని కొల్లగొట్టే అంబానీలు, అదానీలు దేశభక్తులా? ప్రజల కోసం పనిచేస్తూ, ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే మేము దేశద్రోహులమా? అని ప్రశ్నించారు. 2026 నాటికి మావోయిస్టులు లేకుండా చేస్తానని ప్రకటించిన అమిత్ షా, ముందు దేశంలో అవినీతి, నిరుద్యోగాన్ని అంతం చేయడంపై దృష్టి పెట్టాలి అని హితవు పలికారు. సీపీఎం రాష్ర్ట కార్యదర్శి జాన్‌వెస్లీ మాట్లాడుతూ.. “మనుషులను చంపే అధికారం కేంద్రానికి ఎవరిచ్చారని, ఎన్‌కౌంటర్లలో పోలీసులకు ఎందుకు గాయాలు కావడం లేదు అని ప్రశ్నించారు.

సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ, మాస్, లిబరేషన్ పార్టీల నాయకులు కూడా ఈ హత్యలను తీవ్రంగా ఖండించారు. ప్రొఫెసర్ జి హరగోపాల్ మాట్లాడుతూ.. రాజ్యాంగం ప్రకారం ప్రాణా లు తీసే అధికారం రాజ్యానికి లేదు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అర్బన్ నక్సలైట్లు అంటారా అని ప్రశ్నించారు. హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీ.చంద్రకుమార్ మాట్లాడు తూ.. ఖనిజాల కోసం 1600 ఎకరాల భూమిని కేవలం ఒక్క రూపాయికే అప్పగించడం వెనుక ఉన్న కుట్రను ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు.

ఈ నిరసన కార్యక్రమంలో టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదం డరామ్, సీపీఐ సీనియర్ నాయకులు సయ్యద్ అజీజ్ పాషా, పల్లా నరసింహారెడ్డి, పౌర హక్కుల సంఘం నాయకురాలు సంధ్య, వివిధ ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.