22-11-2025 02:06:22 AM
ముషీరాబాద్, నవంబర్ 21 (విజయక్రాంతి): స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్లను 42 శాతం నుంచి 22 శాతానికి తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరిం చుకోవాలని, లేదంటే రాష్ట్రం అగ్నిగుండంగా మారుస్తామని అఖిలపక్ష సమావేశంలో బీసీ జేఏసీ చైర్మన్, ఎంపీ ఆర్ కృష్ణయ్య, పలువురు వక్తలు హెచ్చరించారు. శుక్రవారం లకిడికాపూల్‌లోని అశోక హోటల్‌లో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు.
ఆర్ కృష్ణ య్య నాయకత్వంలో జరిగిన 130 బీసీ కుల సంఘాలు, 45 బీసీ సంఘాలు, ఉద్యో గ సంఘాలు, విద్యార్థి సంఘాల రౌండ్ టేబుల్ సమావేశానికి బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య ప్రసంగిస్తూ.. తన చివరి రక్తపు బొట్టు ఉన్నంత వరకు బీసీ జాతి కోసం పోరాటం చేస్తానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 42 శాతం నుంచి 22 శాతంకు తగ్గించి బీసీలకు ద్రోహం చేసిందని విమర్శించారు.
చట్టబద్ధంగా 42 శాతం ప్రకటించి పార్టీ పరంగా ఇస్తామని చెప్పడం దుర్మార్గమని అన్నారు. ఈ మోసానికి రాష్ట్ర ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించుకుంటుందని విమర్శించారు. కాంగ్రెస్ నాయకత్వం వహించే ఇండియా కూటమికి లోక్ సభలో 240 మంది ఎంపీలు ఉన్న ఒక్కరోజు పార్లమెంట్ ప్రశ్నించలేదన్నారు. మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ మధుసూదనాదారి మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్లు 22 శాతం తగ్గించి బీసీలను అవమానపరిచారని, దీనిపై ప్రభుత్వానికి గుణపాఠం నేర్పాలని అన్నారు.
మార్చికి ఇంకా 4 నెలలు సమయం ఉన్నదని, హై కోర్టులో ఉన్న కేసు నెలలోపు పూర్తి అవుతుందన్నారు. ఇంతలో అఖిల రాజకీయ పక్షాలతో ప్రధాన మంత్రితో చర్చలు జరిపి సమస్య పరిష్కారం చేయాలన్నారు. సినీ నటుడు ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతూ.. బీసీలందరూ ఐక్యంగా ఉద్యమించా లని కోరారు. హైకోర్టులో ఉన్న కేసుపై ప్రభుత్వం ప్రముఖ అడ్వకేట్లు పెట్టి కేసు వాదిస్తే బీసీలకు అనుకూలంగా తీర్పు వస్తుందని చెప్పారు.
ఈ సమావేశానికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం కో- ఆర్డినేటర్ డాక్టర్ ర్యాగ రిషి అరుణ్ కుమార్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేష్ ముదిరాజ్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పగిళ్ల సతీష్ కుమార్, బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు జి అనంతయ్య, నిఖిల్ పటేల్, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.