సొసైటీల్లో ఎరువుల కొరత లేకుండా చూడాలి
జిల్లా సహకార అధికారి సంజీవ రెడ్డి
మంచిర్యాల,విజయక్రాంతి : జిల్లాలోని 20 ప్రాథమిక సహకార సంఘ సొసైటీలో ఎరువుల కొరత లేకుండా చూడాలని జిల్లా సహకార అధికారి సంజీవరెడ్డి అన్నారు. శుక్రవారం డిసిఓ కార్యాలయంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కల్పనతో కలిసి ఆయన మాట్లాడారు. ఎరువుల కొరత ఏర్పడకుండా ఎప్పటికప్పుడు ఇండెంట్ పెట్టాలని, మీకు అవసరమైన ఎరువుల ఇండెంట్ ఆధారంగానే వ్యవసాయ శాఖ అధికారులు ఆన్ లైన్ లో ఎరువుల అమ్మకం వివరాలు పరిశీలించి ఎరువులను అలర్ట్ చేస్తారని అన్నారు. వచ్చిన ఎరువుల వివరాలను ఈపాస్ మిషన్ లో ఎంటర్ చేయాలని, అలాగే రైతులకు రైతు భూమి ఆధార్ కార్డు వివరాలతో అవసరమైన ఎరువులను అందజేయాలని, ఎన్ని బస్తాలు ఏ రైతుకు అమ్మారో అది కూడా ఆన్లైన్లో పొందుపరచాలన్నారు. రైతులకు ఇబ్బంది కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే ఈపాస్ లో ఎరువుల స్టాకు, సేల్ వివరాలు ఎలా నమోదు చేయాలో డీఏవో కల్పన అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సహకార శాఖ రిజిస్టర్ రవీందర్, సురేందర్ జిల్లాలోని అన్ని పిఏసీఎస్ ల సిఈఓ లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






