19 May, 2026 | 10:54 AM

సాఫ్ట్‌వేర్ కంపెనీ మోసం

20-06-2024 12:20 AM
  • ఒక్కో నిరుద్యోగి నుంచి రూ.50 వేలు వసూలు చేసి బోర్డు తిప్పేసిన ‘రైల్ వరల్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్’ 
  • రాయదుర్గం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసిన బాధితులు

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 19 (విజయక్రాంతి): చదివిన చదువుకు ఉద్యోగాలు రాక, కన్నవారికి ముఖం చూపించలేక, పుట్టిన ఊరికి వెళ్లలేక డబ్బు చెల్లించి మరి ఉద్యోగాలను కొంటున్నారు కొందరు నిరుద్యోగులు. ఇదిలా ఉంటే, కష్టపడకుండా డబ్బు సంపాదించే మార్గాలను అన్వేషిస్తూ, నిరుద్యోగులను నిండా ముంచుతున్నారు మరికొందరు అక్రమార్కులు. ఈ క్రమంలో తాజాగా హైదరాబాద్‌లో ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ బోర్డు తిప్పేసింది. రాయదుర్గం ఇన్‌స్పెక్టర్ వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం.. బెంగుళూరుకి చెందిన ప్రకాశ్ సింగ్ అనే వ్యక్తి  నిరుద్యోగులకు లక్షల్లో జీతాలు ఉన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ఇస్తామంటూ ‘రైల్ వరల్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ’ పేరుతో మే నెలలో గచ్చిబౌలిలో ఓ బ్రాంచ్‌ను ప్రారంభించారు.

బెంగళూరు, పుణె, ముంబై, హైదరాబాద్ ఇలా నాలుగు చోట్ల తమ కంపెనీ బ్రాంచ్‌లు ఉన్నాయంటూ ఉద్యోగులను నమ్మించారు. అలా నమ్మి హైదరాబాద్‌లో పదుల సంఖ్యలో నిరుద్యోగులు అడ్వాన్స్ కింద డబ్బులు చెల్లించారు. నెలన్నర క్రితం ప్రారంభమైన ఈ కంపెనీలో దాదాపు 49 మంది నిరుద్యోగుల నుంచి సెక్యూరిటీ డిపాజిట్ల పేరుతో ఒక్కో ఉద్యోగి నుంచి రూ. 40 వేలు తీసుకొని సుమారు రూ.18 లక్షలు వసూలు చేశారు. 

అయితే గత నాలుగు రోజులుగా కంపెనీ తాళాలు వేసి ఉండడంతో జాబ్ గురించి నిరుద్యోగులు వాకబు చేసేందుకు గచ్చిబౌలి వెళితే అక్కడ ఆఫీసు మూసి ఉంది. దీంతో అనుమా నం వచ్చిన పలువురు నిరుద్యోగులు కంపెనీ ప్రతినిధులకు ఫోన్ చేయగా కంపెనీ మూసి వేశామని బదులిచ్చారు. ఇక్కడే కాదు మిగతా మూడు నగరాల్లోనూ కంపెనీ మూసివేసిన ట్లు బాధితులు గుర్తించారు. దీంతో మోసపోయామని గ్రహించిన ఉద్యోగులు తమకు న్యాయం చేయాలంటూ బుధవారం రాయదుర్గం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రైల్ వరల్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ ప్రకాశ్ సింగ్‌పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.