06-01-2026 12:00:00 AM
నార్మ్ డైరెక్టర్ డా.గోపాల్ లాల్
గరిడేపల్లి, జనవరి 5 : సేంద్రియ ఎరువుల వినియోగంతోనే భూసారం పెరిగి,నాణ్యమైన పంటలు మరియు స్థిరమైన దిగుబడులు సాధ్యమవుతాయని నార్మ్ డైరెక్టర్ డా. గోపాల్ లాల్ తెలిపారు. సోమవారం మండలం కేవీకే గడ్డిపల్లిలో షెడ్యూల్ కులాల రైతుల కోసం నిర్వహించిన ఐదు రోజుల సేంద్రియ వ్యవసాయ శిక్షణ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీర్ఘకాలంగా రసాయన ఎరువుల అధిక వినియోగం వల్ల నేలలో సేంద్రియ కర్బన్ తగ్గి జీవశక్తి దెబ్బతింటోందన్నారు. సేంద్రియ వ్యవసాయం ద్వారా నేల ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఎంపిక చేసిన రైతులకు ట్రైనింగ్ మాన్యువల్ కిట్, జీవన ఎరువులు, పప్పు, పిండి, బెల్లం, వేస్ట్ డీకంపోజర్, తదితర సేంద్రియ ఇన్ పుట్స్ పంపిణీ చేశారు.
అనంతరం నార్మ్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ మరియు ప్రోగ్రామ్ డైరెక్టర్ డా.యం. బాలకృష్ణన్ మాట్లాడుతూ.. సేంద్రియ వ్యవసాయ విశిష్టత, దాని ద్వారా కలిగే ఆర్థిక లాభాలు,తక్కువ ఖర్చుతో వ్యవసాయం చేయగల మార్గాలు, అలాగే సేంద్రియ ఉత్పత్తుల ద్వారా స్వయం ఉపాధి అవకాశాలు పెంపొందించుకోవ చ్చని రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ దొంగరి నరేష్, శాస్త్రవేత్తలు డి.నరేష్, సి.హెచ్.నరేష్, ఎ.కిరణ్,డి.ఆదర్శ్,డా.పి.అక్షిత్ సాయి, ఎన్.సుగంధి,50 మంది రైతులు పాల్గొన్నారు.