01-09-2025 01:25:49 AM
-‘సాక్ష్యం’ కవితా సంపుటి ఆవిష్కరణ
-మానవ హక్కుల కార్యకర్త ప్రొఫెసర్ జీ.హరగోపాల్
ముషీరాబాద్, ఆగస్టు 31(విజయక్రాంతి): యుద్ధ సంక్షోభ కాలంలో సాను భూతి కంటే సంఘీభావం అత్యంత ముఖ్యమని మానవ హక్కుల కార్యకర్త ప్రొఫెసర్ జి. హరగోపాల్ అన్నారు. దొంతం చరణ్ రాసిన ’సాక్ష్యం’ అనే కవితా సంపుటిని బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఆవిష్కరించి మాట్లాడారు. మానవ హననం జరగని, హక్కులు కాలరాయబడని సమాజాన్ని కాంక్షించాలని, అందుకు మనమంతా సంఘటితమై పోరాడాలని పిలుపునిచ్చారు.
వీక్షణం పత్రిక సంపాదకులు ఎన్.వేణుగోపాల్ మాట్లాడుతూ చరణ్ కవిత్వం సామాజిక స్పృహ కలదని అన్నారు. ప్రముఖ కవి విమర్శకుడు ఎ.కె.ప్రభాకర్ మాట్లాడుతూ పాలస్తీనా భూభాగంలో ఇజ్రాయెల్ చేస్తున్న మారణకాండకు బలవుతున్న పసిపిల్లల, తల్లుల ఘోషను రచయిత తన గుండెకు హత్తుకున్నాడని అన్నారు. అధ్యక్షత వహించిన మహేష్ వేల్పుల మాట్లాడుతూ ఒక సున్నితమైన మనిషి బలమైన కవిత్వం రాశాడని అన్నారు.
ప్రముఖ కవి, విశ్లేషకులు పుప్పాల శ్రీరామ్, రచయిత్రి తీగల లావణ్య, ప్రియాం క, అరుణ వక్తలుగా చరణ్ కవిత్వంపై ప్రసంగిస్తూ బలమైన మానవవీయతతో, భరోసా కల్పించేలా పుస్తకం ఉందని చెప్పారు. పర్యావరణ కార్యకర్తలు అన్సార్, టీన, వైష్ణవి, పేర్ల రాము, వివిధ యూనివర్సిటీ నుండి వచ్చిన విద్యార్థులు పాల్గొన్నారు.