23-04-2025 03:44:50 PM
మానుకోట కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్
మహబూబాబాద్,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన భూభారతి - చట్టం ద్వారా భూ సమస్యలకు సత్వర పరిష్కారం లభిస్తుందని, ఇకనుంచి రైతులకు భూములకు సంబంధించిన ఇబ్బందులు ఉండవని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. జిల్లాలోని ఇనుగుర్తి, నెల్లికుదురు మండలాల్లో భూభారతి నూతన చట్టం పై అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నూతన భూభారతి చట్టం 2025 ద్వారా రైతులకు ఉచిత న్యాయ సేవలు, అందుబాటులో ఉన్నాయని, తమ సమస్యను దరఖాస్తు చేసుకునే సౌకర్యం ఉందని, వివిధ స్థాయిలో నిర్ణీత సమయాలలో దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతుకు న్యాయం చేయడం జరుగుతుందన్నారు.
త్వరలో గ్రామసభలు నిర్వహించి రైతుల నుండి తమ సమస్యలు, విజ్ఞప్తులను స్వీకరించడం జరుగుతుందన్నారు. భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం గ్రామ పరిపాలన అధికారి, మండల సర్వేయర్లను నియమించి తద్వారా క్షేత్రస్థాయిలో నూతన రికార్డుల నిర్వహణకు సులభతర చర్యలు చేపట్టనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కే.వీరబ్రహ్మచారి, ఆర్డీవోలు కృష్ణవేణి, గణేష్, ల్యాండ్ సర్వే ఏ డి నరసింహమూర్తి, తహసిల్దార్లు రవీందర్, రాజు, ఎంపీడీవోలు హరిప్రసాద్, బాలరాజు, ఏడిఏ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.