27-12-2025 01:48:10 PM
హైదరాబాద్: హైదరాబాద్ నగర పోలీసులు(Hyderabad City Police) గత ఏడాదితో పోలిస్తే 2025లో మొత్తం నేరాల సంఖ్యలో 15శాతం తగ్గుదల నమోదైనట్లు నివేదించారు. ఇది శాంతిభద్రతల అమలు సామర్థ్యం, ప్రజల భద్రతలో ఒక ముఖ్యమైన ముందడుగును సూచిస్తుంది. కమిషనర్ వి.సి. సజ్జనార్(CP Sajjanar) విడుదల చేసిన వార్షిక నేర నివేదిక 2025ను విడుదల చేశారు. నేరాల నియంత్రణలో మెరుగైన ఫలితాలు సాధించామని సీపీ తెలిపారు. ఆపరేషన్ కవచ్, డ్రోన్ల వినియోగంలో మనం ముందున్నామని సూచించారు.
తెలంగాణలో అడుగుపెట్టేందుకు ఇతర రాష్ట్రాల గ్యాంగులు భయపడుతున్నాయని సజ్జనార్ వెల్లడించారు. సైబర్ నేరాలపై ప్రజల్లో విస్తృత అవగాహన(Awareness of cyber crimes) కల్పిస్తున్నామని తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది సైబర్ నేరాలు 8 శాతం తగ్గాయని వివరించారు. మహిళలపై నేరాలు 6 శాతం మేర తగ్గాయన్నారు. ఈ ఏడాది పోక్సో కేసులు కూడా బాగా తగ్గాయన్నారు. సైబర్ నేరాల విషయంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అధిక లాభాలు వస్తాయనే మాటలు నమ్మి మోసపోవద్దని సజ్జనార్ సూచించారు. డ్రగ్ ఫ్రీ సొసైటీ(Drug-free society) కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. డ్రగ్ నియంత్రణకు మరిన్ని టీమ్ లు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. వచ్చే ఏడాది జోనల్ వారీగా టీమ్ లు ఏర్పాటు చేస్తామన్నారు.
గతేడాది రేప్ కేసులు 484 నమోదైతే ఈ ఏడాది 405 కేసులు నమోదయ్యాయని తెలిపారు. కిడ్నాప్ కేసులు గతేడాది 324 నమోదైతే ఈ ఏడాది 166కు తగ్గాయన్నారు. ప్రాపర్టీ వివాద కేసులో కూడా 64 శాతం మేర తగ్గాయని పేర్కొన్నారు. నేరాల్లో శిక్షలు పడిన కేసుల సంఖ్య కూడా బాగా పెరిగిందన్నారు. రోడ్డు ప్రమాదాల సంఖ్య 3,058 నుంచి 2,678కి తగ్గాయని, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల(Drunk driving cases) సంఖ్య 20 శాతం మేర తగ్గిందని స్పష్టం చేశారు. న్యూఇయర్ వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలని సజ్జనార్ హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో వేడుకలు నిర్వహించాలని ఆయన సూచించారు. మద్యం సేవించిన వారు బయటకు రావొద్దని సీపీ సజ్జనార్ వార్నింగ్ ఇచ్చారు. కుటుంబ సభ్యులతో ఇళ్లలోనే వేడుకలు చేసుకుంటే మంచిందని ఆయన సూచించారు. రాష్ అండ్ డేంజరస్ డ్రైవింగ్ కట్టడికి మరిన్ని చర్యలు చేపడతామని సజ్జనార్ తెలిపారు.