పోలీస్ శాఖ పట్ల ప్రజల్లో విశ్వసనీయత పెంచాలి: ఎస్పీ
కొత్తగూడెం,(విజయక్రాంతి): పోలీస్ శాఖ పట్ల ప్రజల్లో విశ్వసనీయతను పెంచాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గ పరిధిలోని టేకులపల్లి పోలీస్ స్టేషన్ శుక్రవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ అధికారులు, సిబ్బంది తగు చర్యలు తీసుకుంటూ పోలీస్ శాఖ పట్ల ప్రజల్లో విశ్వసనీయతను పెంచాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ తెలిపారు.
ఈ సందర్భంగా టేకులపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన రిక్వెస్ట్ బస్ స్టాప్ ను, పోలీస్ స్టేషన్లో వాహనాల కోసం ఏర్పాటు చేసిన షెడ్డును, టేకులపల్లి బోడు రోడ్డు సెంటర్, ముత్యాలంపాడు క్రాస్ రోడ్డుల్లో ఏర్పాటు చేసిన నిఘానేత్రాలను ఎస్పీ ప్రారంభించారు. పోలీస్ స్టేషన్లో రికార్డులను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ను సుందరంగా తీర్చిదిద్దిన టేకులపల్లి సిఐ తాటిపాముల సురేష్, ఎస్ఐ పోగుల సురేష్ ను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు డీఎస్పీ చంద్రబాను, టేకులపల్లి సీఐ తాటిపాముల సురేష్, టేకులపల్లి, బోడు ఎస్ఐలు పోగుల సురేష్, శ్రీకాంత్ లు పాల్గొన్నారు.






