22 July, 2026 | 2:00 AM

పోలీసు శునక దళం ప్రతిభకు రాష్ట్ర స్థాయి గుర్తింపు

22-07-2026 12:00 AM

నిర్మల్ జులై 21 ( విజయ క్రాంతి): తెలంగాణ పోలీసు ఇంటెలిజెన్స్ విభాగం విడుదల చేసిన 2026 తొలి అర్ధవార్షిక సేవా నివేదిక (జనవరిజూన్)లో నిర్మల్ జిల్లా పోలీసు శునక దళం (Dog Squad) అత్యుత్తమ పనితీరుకు రాష్ట్ర స్థాయిలో ప్రశంస దక్కించుకున్నట్టు జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. ఈ వారిని మంగళవారం అభినందించారు

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నివేదికలో నిర్మల్ జిల్లా పరిధిలో నమోదైన హత్య, అనుమానాస్పద మృతి, దొంగతనం, ఆలయ చోరీ, మాదకద్రవ్యాల కేసులతో పాటు పలు కీలక కేసుల్లో పోలీసు శునకాలు‘ యామి, జెస్సీ, బోల్ట్‘ సంఘటన స్థలాల్లో కీలక ఆధారాలను గుర్తించడం, నిందితుల జాడలను కనిపెట్టడం, దర్యాప్తును వేగవంతం చేయడంలో విశేష పాత్ర పోషించినట్లు పేర్కొన్నారు.

శునకాలతో సమన్వయంగా విధులు నిర్వహించి కేసుల ఛేదనలో కీలక పాత్ర పోషించిన ఏఆర్పీసీ జి. పరమేశ్వర్, ఏఆర్పీసీ కె. శ్రీనివాస్, ఏఆర్పీసీ జి. సాయేందర్లను జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించి ప్రశంసాపత్రాలు అందజేశారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, నేరాల దర్యాప్తులో శునక దళం అందించే సేవలు అమూల్యమైనవని, శాస్త్రీయ దర్యాప్తులో పోలీసు శునకాల పాత్ర రోజురోజుకూ మరింత కీలకంగా మారుతోందని తెలిపారు.

ఇదే నిబద్ధత, క్రమశిక్షణతో భవిష్యత్తులో కూడా మరిన్ని విజయాలు సాధించి జిల్లా పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని డాగ్ హ్యాండ్లర్లను ప్రోత్సహించారు.నిర్మల్ జిల్లా పోలీసు శునక దళం సాధించిన ఈ రాష్ట్రస్థాయి గుర్తింపు జిల్లా పోలీసు శాఖకు గర్వకారణమని జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, ఐపీఎస్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్, సీఐ కృష్ణ, జిల్లా డాగ్ స్క్వాడ్ ఇన్చార్జి ఆర్‌ఐ శేఖర్ ,రామకృష్ణ , ఆర్‌ఎస్‌ఐలు, డాగ్ స్క్వాడ్ సిబ్బంది మరియు పోలీసు అధికారులు పాల్గొన్నారు.