07-10-2025 01:00:19 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 6 (విజయక్రాంతి ): పద్మశాలీలు ఐక్యంగా ఉంటేనే రాజ్యాధికారం సాధ్యమవుతుందని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సంఘటితంగా పోటీ చేసి తమ సత్తా చాటాలని తెలంగాణ ప్రాంత పద్మశాలీ సంఘం రాష్ర్ట అధ్యక్షుడు కమర్తపు మురళి పిలుపునిచ్చారు. ఎల్‌బీ నగర్ సర్కిల్ పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 12న నిర్వహించనున్న 23వ దసరా మేళా ఉత్సవాల నేపథ్యంలో, సోమవారం కొత్తపేటలోని సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
గత 22 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా, పద్మశాలీల అభివృద్ధి కోసం ఎల్‌బీనగర్ సర్కిల్ సంఘం దసరా మేళాను నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇలాంటి మేళాల ద్వారా మనలో ఐక్యతను పెంపొందించుకుని, సమాజంలో ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందేందుకు అవకాశం లభిస్తుందని అన్నారు. ఇలాంటి కలయికలు కేవలం ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికే కాకుండా, మన ఐక్యతను రాజకీయ పార్టీలకు చాటి చెప్పేందుకు దోహదపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పద్మశాలీయులు అధిక సంఖ్యలో పోటీ చేసి తమ సత్తా చూపించాల్సిన సమయం ఆసన్నమైంది. దసరా మేళా వంటి కార్యక్రమాల్లో మనం అధిక సంఖ్యలో పాల్గొని, మన బలం ఏంటో రాజకీయ పార్టీలకు చూపించాలి. మన ఐక్యతతోనే రాజ్యాధికారం సాధించుకోగలం, అని మురళి స్పష్టం చేశారు. ఈనెల 12న వనస్థలిపురంలోని హరిణి వనస్థలి ఎకో పార్కులో ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగే ఈ ఆత్మీయ సమ్మేళనానికి రాష్ర్టంలోని పద్మశాలీయులంతా పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.
సమావేశంలో ఎల్‌బీ నగర్ సర్కిల్ అధ్యక్షుడు పున్న గణేశ్ , దసరా మేళా కమిటీ చైర్మన్ కౌకుంట్ల రవితేజ, అఖిలభారత పద్మశాలీ సంఘం మీడియా విభాగం జాతీయాధ్యక్షుడు అవ్వారి భాస్కర్, తెలంగాణ ప్రాంత పద్మశాలీ సంఘం మహిళా విభాగం రాష్ర్ట అధ్యక్షురాలు గుంటక రూప సదాశివ్, గ్రేటర్ హైదరాబాద్ పద్మశాలీ సంఘం అధ్యక్షులు కత్తుల సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.