07-10-2025 01:06:59 AM
- స్థానిక సంస్థల రిజర్వేషన్ విచారణను తోసిపుచ్చిన సుప్రీం కోర్టు
- బంతి హై కోర్టుకు.. రేపు విచారణ
- అనుకూలంగా వస్తుందన్న ధీమాలో అధికార పార్టీ
- సానుభూతి పొందేందుకు కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నాటకమంటున్న ఇతర పార్టీలు
- అభ్యర్థుల వేటలో జిల్లాలోని ప్రధాన పార్టీలు
ఖమ్మం, అక్టోబరు 06 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల కోసం షెడ్యూల్, ఇందులో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఖరారు చేసిన విషయం తెలిసిందే! ఈ నెల 9 నుంచి వివిధ దశల్లో ఎంపీటీసీ జడ్పిటిసి సర్పంచ్ ఎన్నికల ప్రక్రి య కొనసాగాల్సి ఉంది. ఈ లోపు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు అమలు చేయనున్న రిజర్వేషన్ అంశంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొంత మంది హైకోర్టు, సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ అంశంపై సుప్రీం కోర్టు సోమవారం (అక్టోబర్ 6) విచారణ చేపట్టింది. ‘స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల అంశం సంబంధిత హైకోర్టులో పెండింగ్లో ఉండగానే సుప్రీంకోర్టును ఎలా సంప్రదిస్తారు?’ అంటూ పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
దీంతో బంతి హైకో ర్టులో పడినట్లయింది. రిజర్వేషన్ అంశంపై సుప్రీంకోర్టు ఏదో ఒకటి తెలుస్తుంది అధికార పార్టీతో పాటు మిగతా పార్టీలు కూడా ఆశించాయి. సుప్రీంకోర్టు విచారణను హైకోర్టుకు వదిలేసింది కాబట్టే రిజర్వేషన్ అంశం పై తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని అధికార పార్టీ భావిస్తోంది. పక్కనున్న తమిళనాడులో 69% రిజర్వేషన్లను అక్కడ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని విషయాన్ని బలంగా చూపుతోంది.ఒకవేళ అలా రాని పక్షంలో ప్లాన్ బిని అధికార పార్టీ సిద్ధంగా ఉంచిందనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది. రిజర్వేషన్లపై అనుకూల తీర్పు వస్తే తమకు వరమవుతుందని ఆశలో బీసీ ఆశావహులు ఉన్నారు. అధికార పార్టీ ప్రకటిం చిన విధంగా తీర్పు రిజర్వేషన్లు అనుకూలంగా వస్తుందా? లేక వ్యతిరేకంగా వస్తుం దా? అనేది తేలాలంటే రేపటి వరకు ఆగాల్సిందే! ఆ తర్వాత గానీ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ అయోమయానికి తెరపడదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
మరో ప్లాన్ సిద్ధంగా ఉంచిందా..?
రిజర్వేషన్ల అంశంపై తీర్పు అనుకూలంగా రాకపోతే ఏం చేయాలనే దానిపై అధికార పార్టీ ఇప్పటికే స్పష్టతతో ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. హై కోర్టు లో అనుకూలంగా వస్తే ప్రస్తుతం ప్రకటించిన రిజర్వేషన్ ప్రాతిపదికనే ముందుకు వెళ్లాలని, ఒకవేళ వ్యతిరేకంగా వస్తే పాత రిజర్వేషన్ల ప్రాతిపదికన (గతంలో మాదిరి బీసీలకు 23% రిజర్వేషన్ల) ఆధారంగానే ఎన్నికలు నిర్వహించే యోచనను అధికార పార్టీ చేస్తున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఓటర్ల జాబితా ఆధారంగా ఫోటోలతో కూడిన ఓటరు జాబితా ఇప్పటికే సిద్ధంగా ఉంది కాబట్టి ఎన్నికల ప్రక్రియకు పెద్ద ఇబ్బంది ఉండదనేది అధికార పార్టీ ధీమా! అయితే, చిక్కుముడులు ఏమీ లేకుండా చూసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి, ఎన్నికల ప్రక్రియ కాస్త ఆలస్యం అయ్యే అవకాశం ఉం టుంది.
అందుకు అనుగుణంగా ముందుకు వెళ్లాలనే అభిప్రాయంలో ఉన్నట్లు తెలుస్తోంది. రిజర్వేషన్ల అంశం చాలా చిక్కుము డులతో కూడుకున్నదని, ఇది తెలిసే అధికార పార్టీ 42 శాతం రిజర్వేషను అంటూ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను మొదలుపెట్టిందని విమర్శలు ఇతర పార్టీల నుంచి వినవస్తోంది. అధికార పార్టీ ఎన్నికల్లో లాభ పడేందుకు ఇలాంటి జిమ్మిక్కులు చేస్తోందని, దీనివల్ల ఆయా వర్గాలకు మేలు చేసేం దుకు తాము సిద్ధంగా ఉన్నా, రాజ్యాంగ నియమ నిబంధనలు అడ్డుపడ్డాయని చెప్పి వారి నుంచి ఓట్లు దండుకునే కుయుక్తి తప్పించి మరోటి కాదన్న అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది.
బీసీ రిజర్వేషన్ సీట్ల జాబితా సక్రమంగా లేదా..?
బీసీ రిజర్వేషన్ అంటూ అధికార పార్టీ విడుదల చేసిన జాబితా అడ్డదిడ్డంగా ఉంద న్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎస్టీ తండాలను బీసీలకు కేటాయించిన ఘటనలు జిల్లాలో ఉన్నాయి. దీనిపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. అసలు తండాలు అంటేనే ఎస్టీలకు సంబంధించినదని ఇలాం టి వాటిని బీసీలకు ఎలా కేటాయిస్తారు అన్న ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి. బీసీలకు మేలు చేసే క్రమంలో ఇతర వర్గాలకు ఎలా అన్యాయం చేస్తారనీ ఆగ్రహం కూడా వ్యక్తం అవుతోంది. జిల్లాలోని కూసుమంచి మండలం ధర్మా తండా సీటు కేవలం రెండు ఓట్లున్న బీసీల జాబితాలోని వెళ్ళింది. దీనిపై తండా వాసులు మూడు రోజుల కిందట బహిరంగ నిరసన కూడా తెలియజేశారు. ఈ అంశాన్ని ఉదహరిస్తూ, బీసీ రిజర్వేషన్ సీట్ల జాబితా తప్పులతడకగా ఉందనే దానికి బలం చేకూరుస్తుందనే విమర్శలను ఆయా పార్టీలు వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటి పొరపాట్లను సరిదిద్దుకొని అధికార పార్టీ ఎన్నిక లకు వెళుతుందా లేదా? తేలాల్సి ఉంది.
తలమునకలైన పార్టీలు..
అధికార కాంగ్రెస్ పార్టీ కొద్ది నెలల కిందట జరిపిన ఇంటింటి కుటుంబ సర్వే ఆధారంగా బీసీలకు రిజర్వేషన్లను పెంచుతామని గతంలో ప్రకటించింది. అనుకున్నట్లు గా ముందుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల నిర్ణయాన్ని తీసుకుంది. అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఏ యే స్థాని క సంస్థల సీట్లు బీసీలకు వర్తిస్తాయో ఓ జా బితాను కూడా విడుదల చేసింది. ఈ జా బితా ఆధారంగా ఆయా స్థానాల్లో ఏ పార్టీ అయినా బీసీ అభ్యర్థులను నిలబెట్టక తప్పని పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఒక్కో స్థానానికి ముగ్గురు అభ్యర్థుల జాబితాను త యారు చేయించే పనిలో ఉందన్న సంగతి తెలిసిందే! జిల్లా నుంచి పొంగులేటి, భట్టి, తుమ్మల వంటి మంత్రులు ఉండడంతో, అ ధికార పార్టీకి అభ్యర్థుల ఎంపిక పెద్ద సమస్య కాదనే అభిప్రాయం వినిపిస్తోంది.
ఇక ప్ర ధాన పార్టీలైన బీఆర్‌ఎస్, బిజేపీలు కూడా తమ అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసే ప నిలో తలమునకలై ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో బీఆర్‌ఎస్ పదేళ్లు ప్రభుత్వాన్ని నడిపినా, ప్రస్తుతం ఆ పార్టీ అధికారంలో లేక పోవడానికి తోడు, జిల్లాలో మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండడం, ప్రస్తుతం ముగ్గురు మంత్రులు జిల్లా నుంచి ఉండటం వంటి అంశాలు బిఆర్‌ఎస్ పార్టీకి సంకటంగా మారింది. దీంతో ఆ పార్టీ అభ్యర్థుల వేటలో ఆచితూచి అడుగు వేస్తున్నట్లు సమాచారం. ఇక బిజెపి స్థానికంగా పట్టు లేకపోవ డంతో ఆ పార్టీకి జిల్లాల అభ్యర్థుల వేట పెద్ద సమస్యగా ఉంది.
మరోవైపు ఆయా పార్టీల ఆశావహులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు అన్ని విధాలుగా సిద్ధమయ్యారు. రిజర్వేషన్లపై కోర్టు తీర్పులు ఎలా ఉన్నా, ముందు తమ పేరు పార్టీ ప్రకటించే జాబితా లో ఉంటే తర్వాత సంగతి ఆపైన చూసుకోవచ్చనే ఉద్దేశంతో ప్రయత్నాలు మొదలుపె ట్టారు. తాము ఇన్నాళ్ల నుంచి పార్టీకి చేసిన సేవలు, టికెట్ ఇస్తే తాము ఏం చేస్తామో తె లియజేయటమే కాకుండా, తమ అంగ, అర్థ బలాల ప్రదర్శన కూడా చేస్తూ, ఆయా పా ర్టీల ముఖ్య నాయకులను కాకా పట్టే పనిలో బిజీగా ఉన్నారు. మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ రసకందాయంలో పడిందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.