calender_icon.png 20 July, 2025 | 10:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్టీల్ బ్రిడ్జీలుగా ఫ్లుఓవర్లు

06-12-2024 01:09:25 AM

  1. కేబీఆర్ పార్క్ చుట్టూ ఏడు ఫ్లుఓవర్లు
  2. ఆరు అండర్ పాస్‌లు.. ఒక యూనీ డైవర్షనల్ లేన్
  3.  రూ.826 కోట్ల అంచనా.. అది కాస్త రూ.వెయ్యి కోట్లకు పెరిగే అవకాశం
  4. రెండు దశల్లో పనులు.. ఇంకా మొదలు కాని టెండర్ల ప్రక్రియ

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 5 (విజయక్రాంతి): ప్రజాపాలనా విజయోత్సవాల్లో భాగంగా ‘హైదరాబాద్ రైజింగ్’ పేరుతో ఈ నెల 3న సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్కు చుట్టూ ఆరు జంక్షన్ల పనులకు శంకుస్థాపన చేశారు. కానీ, ఈ ప్రాజెక్టుకు ఇంకా డీపీఆర్ సిద్ధం కాకపోవడం, నిధుల లేమి కారణంగా పనులు పెండింగ్‌లో ఉండే పరిస్థితి నెలకొన్నది.

ఎప్పుడు నిధులు విడులవుతాయా? ఎప్పు డు పనులు ప్రారంభిద్దామా? అన్నట్లు బల్దియా ఇంజినీరింగ్ అధికారులు ఎదురుచూస్తున్నారు.  హైదరాబాద్ మహానగరం లో ట్రాఫిక్ ఇబ్బందులను నివారించేందుకు సర్కార్ కేబీఆర్ పార్కు వద్ద  జంక్షన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సంగతి విదితమే.

పార్క్ పరిసరాలు వీఐపీ జోన్‌తో పాటు అత్యంత రద్దీ అయిన జోన్ కావడంతో కాంక్రీట్‌తో ఫ్లుఓవర్ల నిర్మాణం జఠిలమైన సమస్యగా మారుతుంది. దీంతో బల్దియా స్టీల్ బ్రిడ్జీలు నిర్మించాలని యోచిస్తున్నారు. రెండు దశల్లో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు సుమారు రూ.826 కోట్ల అంచనా ఉందని, ఆ ఖర్చు రూ. 1000 కోట్ల వరకు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిసింది. 

అండర్ పాస్‌లు సైతం..

హెచ్ సిటీ ప్రాజెక్టులో భాగంగా కేబీఆర్ పార్క్ చుట్టూ ఆరు జంక్షన్లలో ఫ్లుఓవర్లు, అండర్‌పాస్‌లు రూపుదిద్దుకోనున్నాయి. వీటన్నింటినీ ముందుగా కాంక్రీట్‌తో చేపట్టాలని జీహెచ్‌ఎంసీ ముందు గా భావించింది. కాంక్రీట్ పను లు చాలాకాలం సాగుతాయనే విషయాన్ని దృష్టి లో పెట్టుకుని బల్దియా ఇందిరాపార్క్  వీఎస్టీ వద్ద నిర్మించినట్లుగానే ఈ జంక్షన్లలోనూ స్టీల్ బ్రిడ్జిలుగా నిర్మించాలని నిశ్చయానికి వచ్చింది.

స్టీల్ బ్రిడ్జిలైతే పిల్లర్లు, ఇతరత్రా పనులు సులువుగా పూర్తవుతాయని భావిస్తున్నది. దీంతో అంతకు ముందు ఓ ప్రైవేట్ ఏజెన్సీ ఇచ్చిన డీపీఆర్‌ను కూడా పక్కనపెట్టినట్టు గా తెలుస్తున్నది.  ప్రాజెక్టు  పరిధిలో మొత్తం ఏడు ఫ్లుఓవర్లు, ఆరు అండర్‌పాస్‌లు, ఒక యూనీ డైవర్షనల్ లేన్ అందుబాటులోకి రానున్నది.

ప్రాజెక్ట్‌కు టెండర్ల ప్రక్రియ నిర్వహించాల్సి ఉన్నది. ప్రాజెక్ట్ పూర్తయితే పంజాగుట్ట, కేబీఆర్ పార్కు, రోడ్డు నంబర్ 10, రోడ్డు నంబర్ 45, బసవ తారకం క్యాన్సర్ దవాఖాన, ఫిల్మ్ నగర్, మాదాపూర్, కొండా పూర్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ తగ్గే అవకాశం ఉంది. 

ఖరారు కాని డీపీఆర్

కేబీఆర్ పార్కు చుట్టూ పార్కు ప్రధాన ద్వారం, జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, రోడ్డు నంబరు 45, ఫిల్మ్ నగర్, మహారాజా అగ్రసేన్, బసవ తారకం క్యాన్సర్ దవాఖాన జంక్షన్లలో నిత్యం ట్రాఫిక్ రద్దీ ఉంటుంది. పార్కు ఎకో సెన్సిటివ్ జోన్ కావడంతో కొత్త నిర్మాణాలను నిలిపివేయాలని కోరుతూ ఇటీవల పర్యావరణవేత్త ఒకరు కోర్టును ఆశ్రయించారు.

ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ అధికారులు ఎకో సెన్సిటివ్ జోన్‌ను టచ్ చేయకుండానే ఫ్లుఓవర్లు, అండర్ పాస్‌లు నిర్మించాల్సి ఉంటుంది.  ప్రాజెక్ట్ జీవో జారీ అయ్యి రెండు నెలలు గడిచినా ఇంకా ఈ నిర్మాణాల వ్యవహారం ముందుకు కదలలేదు.