calender_icon.png 8 January, 2026 | 3:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేంద్ర మాజీ మంత్రి సురేశ్ కల్మాడి కన్నుమూత

07-01-2026 12:00:00 AM

  1. పుణెలోని ఆయన స్వగృహంలో తుదిశ్వాస
  2. అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు
  3. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా గుర్తింపు
  4. భారత క్రీడారంగ అభివృద్ధిలో ముఖ్యపాత్ర
  5. నిస్వార్థ ప్రజాసేవకుడు: ప్రధాని మోదీ
  6. క్రీడారంగ అభివృద్ధి ప్రదాత: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

ముంబై, జనవరి ౬: కేంద్ర మాజీ మంత్రి సురేశ్ కల్మాడి (81) కన్నుమూశారు. కొంతకాలం నుంచి ఆయన అనారోగ్య సమస్యలతో సతమవుతున్న ఆయన పుణెలోని తన నివాసంలో మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. అభిమానుల సందర్శనార్థం కుటుంబ సభ్యులు ఆయన భౌతికకాయాన్ని పుణె ఎరండ్వానేలోని కల్మాడీ హౌస్‌లో ఉంచారు. పలువురు రాజకీయ నాయకులు, కీడాకారులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆయన పార్థివ దేహానికి నివాళి అర్పించారు.

అనంతరం కుటుంబ సభ్యులు నవీపేట్ శ్మశానవాటికలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కల్మాడీ మృతితో పుణె రాజకీయాల్లో ఒక శకం ముగిసినట్లయింది. కల్మాడి మృతిపై ప్రధాని మోదీ సోషల్ మీడియాలో స్పందిస్తూ.. సురేశ్ కల్మాడి నిస్వార్థ ప్రజాసేవకుడు అని, క్రీడారంగ అభివృద్ధికి ఆయన సేవలు ఎనలేనివని కీర్తించారు.

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పందిస్తూ.. భారతీయ క్రీడారంగంలో సురేశ్ కల్మాడి తనదైన ముద్ర వేశారని, ఆయన మార్గదర్శకత్వంలో ఎంతోమంది క్రీడాకారులు అంతర్జాతీయ క్రీడాకారులుగా ఎదిగారని కొనియాడారు. అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మోహన్ జోషి, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్, క్రీడా దిగ్గజం పీటీ ఉష తదితరులు సోషల్ మీడియా వేదికగా తమ సంతాపాన్ని ప్రకటించారు.

పుణె కేంద్రంగా రాజకీయాలు

సురేశ్ కల్మాడి 1944 మే 1న తమిళనాడులోని మద్రాసులో జన్మించారు. ఆయన పాఠశాల విద్య మహారాష్ట్ర పుణెలోని సెయింట్ విన్సెంట్ హైస్కూల్‌లో సాగింది. పుణె ఫెర్గూసన్ కళాశాల నుంచి ఆయన డిగ్రీ పట్టా పొందారు. తర్వాత ఇదే పుణెలోని ఖడఖ్వాస్లాలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ(ఎన్‌డీఏ)లో ఆయన సైనిక శిక్షణ తీసుకున్నారు. జోధ్‌పూర్, అలహాబాద్‌లోని ఎయిర్‌ఫోర్స్ ఫ్లయింగ్ కాలేజీలో పైలట్ శిక్షణ పొందారు. 1964-72 వరకు భారత్ వాయుసేనలో పైలట్‌గా సేవలందించారు.

1965, 1971 ఇండో--పాక్ యుద్ధాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. 1982లో ఆయన రాజకీయ ఆరంగేట్రం చేశారు. మహారాష్ట్ర దిగ్గజ నేత శరద్‌పవార్ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఆయన రాజ్యసభకు ఎన్నికయ్యారు. పీవీ నరసింహారావు ప్రభుత్వంలో ఆయన కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.

ముంబైలోని విక్టోరియా టెర్మినల్‌ను ఛత్రపతి శివాజీ టెర్మినల్‌గా మార్చడంలో ముఖ్యపాత్ర పోషించారు. మూడు పర్యాయాలు పుణె ఎంపీగా ఎన్నికయ్యారు. మరో నాలుగ పర్యాయాలు రాజ్యసభ సభ్యుడిగా నియమితలయ్యారు. భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షుడిగా సేవలందించారు. 2010లో ఢిలీలో జరిగిన కామన్‌వెల్త్ క్రీడల  కమిటీ ఛైర్మన్‌గా వ్యవహరించారు.