calender_icon.png 8 January, 2026 | 4:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మన ఊరు-మనబడి బిల్లులు దయచేసి చెల్లించండి

07-01-2026 12:39:13 AM

  1. నా సొంత గ్రామంలోనే పనులు ఆగిపోయాయి
  2. పిల్లలు చలిలో కూర్చుంటున్నారు
  3. నిధుల విడుదల గురించి సీఎం, డిప్యూటీ సీఎంకు ఏడాదిగా చెబుతున్నా..
  4. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్, జనవరి 6 (విజయక్రాంతి): శాసనమండలి సమావే శాల్లో భాగంగా మంగళవారం ప్రశ్నోత్తరాల సమయంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి విద్యాశాఖపై కీలక వ్యాఖ్యలు చేశారు. జాతీయ విద్యావిధానం, గురుకుల పాఠశాలల అంశాలపై సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి దామోదర రాజనర్సింహ సమాధానం ఇచ్చిన అనంతరం మండలి చైర్మన్ మాట్లాడుతూ.. ‘దయచేసి మన ఊరు--మన బడి బిల్లు లు చెల్లించాలని కోరాను. ప్రభుత్వ పాఠశాలల పునరుద్ధరణ, మౌలిక సదుపాయాల కల్పన కోసం ‘మన ఊరు--మన బడి’ పథకం కింద రూ. 360 కోట్లతో కాంట్రాక్టర్లు పనులు చేపట్టారు.

ప్రస్తుత ప్రభుత్వం వెంటనే ఆ నిధులను విడుదల చేయాలి’ అని అన్నారు. నిధులు విడుదల చేయాలని ఏడాది నుంచి విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తున్నానని చెప్పారు. తన సొంత గ్రామంలోనే పాఠశాల పనులు సగంలో ఆగిపోయాయని పేర్కొన్నారు. చలికాలంలో పిల్లలు ఆరుబయట, చెట్ల కింద కూర్చుంటున్నారని తెలిపారు. రాష్ట్రంలో అన్ని రకాల పేమెంట్లు జరుగుతున్నాయని, అలాగే మన ఊరు-మన బడికు అక్కడక్కడ కొన్ని పేమెంట్లు జరిగాయని, అయితే ప్రస్తుతం అవి కూడా ఆగిపోయాయని పేర్కొన్నారు.

‘ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాపౌట్లు పెరిగాయి, ఈ విద్యాసంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో 3 లక్షల మంది కొత్త విద్యార్థులను చేర్చినట్లు అధికారులు లెక్కలు చెబుతున్నారు. నిజానికి 30 వేల మందిని కూడా చేర్చుకోలేదు. అవన్నీ ఉత్తవే, అధికారులు కేవలం లెక్కలు మాత్రమే చూపిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మన ఊరు- బడి పేమెంట్లను క్లియర్ చేయాలి’ అని ప్రభుత్వాన్ని ఆయన విజ్ఞప్తి చేశారు.