calender_icon.png 16 May, 2025 | 6:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు చర్యలు తీసుకోవాలి

16-05-2025 12:32:29 AM

కలెక్టర్ సంతోష్

గద్వాల, మే 15  (విజయక్రాంతి) : జిల్లాలో రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు సమగ్ర చర్యలు తీసుకుంటూ అధికారులు పూర్తి నిబద్ధతతో,బాధ్యతాయుతంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ అధికారులను ఆదేశించారు. గురువారం ఐడీవోసీ కాన్ఫరెన్స్ హాల్ నందు రోడ్డు భద్రతా జిల్లా కమిటీ సమావేశంలో జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు,వివిధ శాఖల అధికారులతో కలసి పాల్గొని రోడ్డు భద్రతా చర్యలపై సమీక్షించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ,ప్రమాదాలకు ఆస్కారం లేకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. బీచుపల్లి నుంచి పుల్లూర్ జంక్షన్ వరకు ప్రమాద ప్రాంతాలను బ్లాక్ స్పాట్ గుర్తించి, వాటిపై సోమవారం నాటికి పోలీసు, జాతీయ రహదారుల అధికారులతో సంయుక్త పరిశీలన జరిపి తక్షణ చర్యలు తీసుకోవాలని  ఆదేశించారు.

ఎర్రవల్లి నుండి గద్వాల వరకు ప్రమాద సూచిక బోర్డులు, హెచ్చరికల గుర్తులు, కల్వర్టుల మరమ్మతులు  చేయాలని ఆర్ అండ్ బి శాఖను ఆదేశించారు. గద్వాల నుంచి రాయచూర్ మార్గంలో ఉన్న స్పీడ్ బ్రేకర్లు ఎత్తుగా ఉండటంతో ప్రమాదాలకు అవకాశమున్నదని, వాటిని ప్రమాణాలతో అనుగుణంగా సవరించాలని, వాహనదారులకు భద్రతతో పాటు సౌలభ్యం కలిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 

ఈ సమావేశంలో డిఎస్పీ మొగలయ్య, ఆర్ అండ్ బి ఈఈ ప్రగతి, పంచాయతీరాజ్ పి.ఆర్ దామోదర్ రావు, జిల్లా రవాణా అధికారి వెంకట్ రమణ రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సిద్దప్ప, జాతీయ రహదారుల  ప్రాజెక్ట్ డైరెక్టర్ హిమాన్ష్ గుప్త, ఎక్సైస్, పోలీస్, పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బీ డీఈలు, ఏఈలు, తదితరులు, పాల్గొన్నారు.