16-05-2025 12:32:48 AM
జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగు వాన్
కామారెడ్డి, మే 15 (విజయ క్రాంతి): వరి ధాన్యం పంటను త్వరితగతిన తూకం వేసి మిల్లులకు తరలించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. గురువారం కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి విండో ద్వారా ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వరి ధాన్యం సేకరణ త్వరగా చేపట్టాలని అన్నారు.
రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ఏర్పాట్లు ముందస్తుగా చేపట్టాలని తెలిపారు. అకాల వర్షాల వలన ధాన్యం తడిసిపోకుండా ఉండేందుకు టార్పాలిన్ లను అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. ఆరబెట్టిన ధాన్యం ను త్వరగా తూకం వేసి సంబంధిత మిల్లులకు తరలించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాక్స్ చైర్మన్ సదాశివ రెడ్డి, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ రాజేందర్, జిల్లా పౌరసరఫరాల అధికారి మల్లికార్జున్ బాబు, జిల్లా సహకార అధికారి రామ్ మోహన్, ఎంపీడీఓ సంతోష్ కుమార్, తహసీల్దార్ గంగాసాగర్, రైతులు, తదితరులు పాల్గొన్నారు.