08-07-2025 04:39:56 PM
కుభీర్ (విజయక్రాంతి): సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయా గ్రామాల ప్రజలకు ఎంపీడీవో సాగర్ రెడ్డి, ఎంపీఓ మోహన్ సింగ్ సూచించారు. మంగళవారం వారు మండల కేంద్రం కుభీర్ తో పాటు మండలంలోని పార్డి(కే), బ్రహ్మేశ్వర్, సేవాదాస్ నగర్ తదితర గ్రామాలలో పర్యటించారు. అపరిశుభ్రంగా ఉన్న ఇండ్ల ఆవరణలోని చెత్తాచెదారం, వర్షపు నీరు నిలిచి ఉండడం, ఇంటి ఆవరణలో టైర్లు పూల కుండీలు, పగిలిపోయిన మట్టి, ప్లాస్టిక్ వ్యర్ధాల్లో నిలిచి ఉన్న నీటిని తొలగింప చేశారు. వారం రోజులుగా నిల్వ ఉన్న నీటిలో లార్వా అభివృద్ధి చెందిన దోమలు ప్రబలుతాయని దీంతో కుటుంబ సభ్యులకు జ్వరాలు అవకాశం ఉన్నందున ఎప్పటికప్పుడు ఆవరణను శుభ్రం చేసుకోవాలని సూచించారు.
గ్రామాలలో రోడ్లపై గుంతలు ఏర్పడి నీరు నిల్వ ఉండడాన్ని చూసిన వారు గుంతల్లో మొరం వేయించాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. శుక్ర, మంగళవారాల్లో ఆశా కార్యకర్తలు ఇంటింటికి తిరిగి జ్వరాలు రాకుండా మందు పంపిణీ చేయాలని సూచించారు. వర్షాకాలంలో తీసుకునే ఆహారం వేడివేడిగా ఉండాలని పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రతను సైతం పాటించాలని పేర్కొన్నారు. అనంతరం రోడ్లను మురికి కాలువలను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా జిపిల పంచాయతీ కార్యదర్శులు, ఆశా కార్యకర్తలు, పంచాయతీ సిబ్బంది తదితరులు ఉన్నారు.