08-07-2025 05:08:15 PM
సిపిఐ జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకటరెడ్డి..
ఈ నెల 15న దేవరకొండలో సిపిఐ జిల్లా మహాసభ..
జిల్లా కార్యదర్శి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం..
నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): కేంద్రంలో మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 9వ తేదీన పది కార్మిక సంఘాలు 17 డిమాండ్స్ తో చేపట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని సిపిఐ జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకటరెడ్డి(CPI National Committee member Palla Venkata Reddy) పిలుపునిచ్చారు. దేశవ్యాప్త సమ్మెకు సిపిఐ సంపూర్ణ మద్దతును ప్రకటించారు. సిపిఐ నల్లగొండ జిల్లా కార్యవర్గ సమావేశం స్థానిక మగ్దూమ్ భవనంలో మంగళవారం జరిగింది. ఈ సమావేశానికి పల్లా వెంకటరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులు, రైతుల పైన దాడి తీవ్రతరం చేసిందని, కార్మికులు ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్ లుగా తీసుకువచ్చి పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తూ కార్మిక వర్గానికి తీవ్రమైన అన్యాయానికి గురి చేస్తుందని ఆరోపించారు.
కార్మికులు చేపట్టిన సమ్మెతోనైనా కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సిపిఐ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ... నల్లగొండ జిల్లాలో సిపిఐ గ్రామ, మండల మహాసభలు విజయవంతంగా పూర్తి చేసుకొని ఈనెల 15వ తేదీ మంగళవారం దేవరకొండ పట్టణంలో నల్లగొండ 23వ జిల్లా మహాసభ జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ మహాసభలో జిల్లా సమగ్ర అభివృద్ధి, సంస్థగతంగా పార్టీని బలోపేతం చేసుకోవడంతో పాటు ప్రజా ఉద్యమాలపై సుదీర్ఘంగా చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో ఇప్పటికే పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని సిపిఐ అనేక దాపాలుగా ఉద్యమాలు, పోరాటాలు నిర్వహించడం జరిగిందన్నారు.
గత పాలకులు చేసిన నిర్లక్ష్యం వల్లనే సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కాలేదని ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేయడం కోసం పనులు ప్రారంభించిందని అట్టే పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కోరారు. అదేవిదంగా రాష్ట్రలో రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో సిపిఐ అభ్యర్థులు అధిక స్థానాలు గెలుపొందేందుకు పార్టీ నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నరసింహారెడ్డి, జిల్లా సహాయ కార్యదర్శిలు పల్లా దేవేందర్ రెడ్డి, లోడింగి శ్రవణ్ కుమార్, కార్యవర్గ సభ్యులు పబ్బు వీరస్వామి, ఆర్ అంజచారి, బొడ్డుపల్లి వెంకట రమణ, బంటు వెంకటేశ్వర్లు, బొల్గురి నరసింహ, గురిజ రామచంద్రం, నల్పరాజు రామలింగయ్య, టి వెంకటేశ్వర్లు, ఉజ్జిని యాదగిరిరావు తదితరులు పాల్గొన్నారు.