24-07-2025 07:38:38 PM
ప్రాథమిక ప్రభుత్వ ఆసుపత్రుల తనిఖీ..
పాఠశాలలో విద్యార్థులతో మాటామంతి..
నాణ్యమైన విద్య, భోజనాలు కల్పించాలి..
సీజనల్ వ్యాధులు సోకకుండా చర్యలు చేపట్టాలి..
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్..
బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్(District Collector Kumar Deepak) అన్నారు. గురువారం జిల్లాలోని కాసిపేట మండల కేంద్రంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి ఆసుపత్రిలోని వార్డులు, మందుల నిల్వలు, పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, వైద్య రంగాన్ని అభివృద్ధి చేస్తూ ఆసుపత్రులలో అవసరమైన అన్ని వసతులు కల్పించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు.
వర్షాకాలం అయినందున విష జ్వరాలు, అంటు వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, పాటించవలసిన జాగ్రత్తలను ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులతో సీజనల్ వ్యాధులపై తీసుకోవలసిన ముందస్తు జాగ్రత్తలు, రోగులకు అందించే చికిత్స, ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న సదుపాయాలపై ఆయన సమీక్షించారు.
పాఠశాలల తనిఖీ..
మండలంలోని ముత్యంపల్లి గ్రామపంచాయతీ ఆదర్శ పాఠశాలను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సందర్శించి విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు, హాజరు పట్టికలను పరిశీలించారు. పాఠశాలలో వంటశాల అవసరం తెలుసుకొని మంజూరు చేయాలని తెలిపారు. 10వ తరగతి 2 బ్యాచ్ల విద్యార్థులకు స్వయంగా పాఠాలు నేర్పించి, విద్యార్థులతో మాట్లాడారు. పాఠశాలలో అందుతున్న సదుపాయాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి మౌళిక సదుపాయాల వివరాలు తెలుసుకున్నారు. పాఠశాలకు అవసరమున్న మూత్రశాలలను మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటామని, భోజనశాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని గుత్తేదారును ఆదేశించారు. విద్యారంగాన్ని బలోపేతం చేస్తూ అన్ని ప్రభుత్వ పాఠశాలలలో సకల సదుపాయాలు కల్పించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. దేవాపూర్లోని బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించి భోజనశాలను పరిశీలించారు. పద్దతి ప్రకారంగా విద్యార్థులకు సకాలంలో పౌష్టికాహారాన్ని అందించాలని ఆదేశించారు.
ఆర్.ఓ. ప్లాంట్ ను పరిశీలించిన ఆయన విద్యార్థులకు శుద్ధమైన త్రాగునీటిని అందించాలని తెలిపారు. మల్కపల్లి ప్రభుత్వ పాఠశాలను సందర్శించి ఉపాధ్యాయులు, అధికారులకు పలు సూచనలు చేశారు. రేకులగూడ ఆశ్రమ పాఠశాల పరిసరాలను పరిశీలించారు. మురుగునీటి వ్యవస్థ, ఇంకుడు గుంత ఏర్పాటు అంశాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకురాగా మంజూరు చేసే దిశగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ మండల పరిషత్ అభివృద్ధి అధికారిని ఆదేశించారు. గ్రామంలోని తాగు నీటి బావిని పరిశీలించారు. బావికి అవసరమైన మరమ్మత్తులు చేపట్టి చుట్టూ ఫెన్సింగ్తో ఎవరు లోనికి రాకుండా పైన కప్పు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి పురుషోత్తం నాయక్, ఆశ్రమ పాఠశాల ప్రత్యేక అధికారి నీరటి రాజేశ్వరి, మండల పరిషత్ అభివృద్ధి అధికారి సత్యనారాయణ సింగ్, మండల పంచాయతీ అధికారి సప్టర్ అలీ, పంచాయతీ కార్యదర్శులు, సంబంధిత అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.