ఇంధన ధరలతోనే అధిక ద్రవ్యోల్బణం

27-04-2024 12:10:00 AM

ఆహారోత్పత్తుల ప్రభావం తక్కువ

ఆర్బీఐ ఆర్థిక వేత్తలు

న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: ద్రవ్యోల్బణం పెరగడానికి ప్రధాన కారణం ఇంధన ధరలేనని, ఇందులో ఆహారోత్పత్తుల పాత్ర తక్కువేనని రిజర్వ్‌బ్యాంక్ విడుదల చేసిన ఒక పరిశోధనాపత్రంలో ఆర్థికవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ భౌగోళిక  రాజకీయ ఉద్రిక్తతల నడుమ ఇంధన ధరల షాక్ భారీగా ఉంటుందని, మూల ద్రవ్యోల్బణాన్ని ఇవి ఎగవేస్తాయని వారు హెచ్చరించారు. ఆర్బీఐ తన విధాన లక్ష్యంలో భాగంగా ఆహార ద్రవ్యోల్బణాన్ని మెరుగ్గా నియంత్రిస్తుందని, మూల ద్రవ్యోల్బణంలో ఇంధన ధరల ప్రభావం గణనీ యంగా పెరిగిందని రిజర్వ్‌బ్యాంక్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామిక్, పాలసీ రీసెర్చ్‌కు చెందిన ఆర్థిక వేత్తలు వివరించారు. మూల ద్రవ్యోల్బణంపై ఆహార, ఇంధన ధరలు చూపించే ప్రభావాన్ని ఈ పరిశోధనా పత్రంలో విశ్లేషించారు. 

2,3 త్రైమాసికాల్లోనే ఆహార ద్రవ్యోల్బణం షాక్

సాధారణంగా ఏడాదిలో రెండు, మూడు త్రైమాసికాల్లో మూల ద్రవ్యోల్బణానికి ఆహారోత్పత్తుల షాక్ తగులుతుందని, అటుతర్వాత ఇది క్రమేపీ తగ్గుతుందని వారు పేర్కొన్నారు. 1990 దశకంలో మూ ల ద్రవ్యోల్బణంపై ఆహార ధరల ప్రభావం ఎక్కువగా ఉండేదని, తదుపరి తగ్గుతూ వచ్చిందని పరిశోధనా పత్రం పేర్కొంది.