తిరిగి కోలుకున్న మార్కెట్
సెన్సెక్స్ 128 పాయింట్లు అప్
ముంబై, మే 2: గత మంగళవారం రికార్డు గరిష్ఠాల నుంచి అమ్మకాల ఒత్తిడికి లోనైన స్టాక్ మార్కెట్ గురువారం తిరిగి కోలుకున్నది. రికార్డు జీఎస్టీ వసూళ్లు, అంతర్జాతీయ సానుకూల సంకేతాల నడుమ ఒక రోజు సెలవు అనంతరం లాభాలతో ఆరంభమైన స్టాక్ సూచీలు ముగింపు వరకూ అదే ట్రెండ్‌ను కొనసాగించాయి. ట్రేడింగ్ ప్రారంభంలో బీఎస్‌ఈ సెన్సెక్స్ 330 పాయింట్ల మేర పెరిగి 74,812 పాయింట్ల స్థాయిని అందుకున్నది. చివరకు 128 పాయింట్ల లాభంతో 74,611 పాయింట్ల వద్ద నిలిచింది. ఇదేబాటలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 43 పాయింట్ల మేర పెరిగి 22,648 పాయింట్ల వద్ద నిలిచింది.
టాప్‌గేర్‌లో పవర్‌గ్రిడ్
సెన్సెక్స్ బాస్కెట్‌లో అన్నింటికంటే అధికంగా పవర్‌గ్రిడ్ 4 శాతం పెరిగి ఆల్‌టైమ్ గరిష్ఠస్థాయి రూ.314 వద్ద ముగిసింది. ఏషియన్ పెయింట్స్, టాటా మోటార్స్, టాటా స్టీల్, ఎన్టీపీసీ, సన్‌ఫార్మా, మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టీసీఎస్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌లు 1 శాతం మధ్య ర్యాలీ జరిపాయి. మరోవైపు కోటక్ మహీంద్రా బ్యాంక్ తమ జాయింట్ ఎండీ మణియన్ వైదొలిగినట్టు ప్రకటించడంతో ఆ షేరు 3 శాతం నష్టంతో ముగిసింది. ఇది ఇంట్రాడేలో 4 శాతానికి పైగా పతనమయ్యింది. ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ సంజయ్ భక్షి రాజీనామా చేస్తున్నారంటూ వెలువడిన వార్తలను ఆ బ్యాంకు ఖండించినప్పటికీ, షేరు 1 శాతంపైగా తగ్గింది.
నష్టపోయిన షేర్లలో భారతి ఎయిర్‌టెల్, యాక్సిస్ బ్యాంక్, విప్రో, ఇండస్‌ఇండ్ బ్యాంక్‌లు ఉన్నాయి. వివిధ రంగాల సూచీల్లో అధికంగా యుటిలిటీస్ ఇండెక్స్ 1.49 శాతం పెరిగింది. సర్వీసెస్ ఇండెక్స్ 1.24 శాతం, ఆటో ఇండెక్స్ 1.17 శాతం, మెటల్ 1.03 శాతం, కన్జూమర్ డిస్క్రీషనరీ ఇండెక్స్ 0.82 శాతం ఎనర్జీ సూచి 0.61 శాతం, హెల్త్‌కేర్ ఇండెక్స్ 0.31 శాతం చొప్పున లాభపడ్డాయి. టెక్నాలజీ, టెలికాం సూచీలతో పాటు బ్యాంకెక్స్ నష్టపోయింది. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.91 శాతం పెరగ్గా, స్మాల్‌క్యాప్ సూచి 0.29 శాతం పుంజుకుంది.
అంచనాలకు తగ్గట్టే ఫెడ్ సంకేతాలు
యూఎస్ కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై వెల్లడించిన తాజా సంకేతాలు మార్కెట్ అంచనాలకు అనుగుణంగానే ఉన్నందున, గ్లోబల్ ట్రెండ్ సానుకూలంగా కొనసాగిందని, దీంతో దేశీయ స్టాక్ సూచీలు లాభపడ్డాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. బుధవారం రాత్రి ఫెడరల్ రిజర్వ్ ఫండ్స్ రేటును యథాతథంగా 5.5 శాతం వద్ద అట్టిపెట్టింది. ఈ ఏడాది రేట్ల కోతలు ఉండవచ్చన్న సంకేతాలను ఫెడ్ చైర్మన్ జరోమ్ పొవెల్ వెల్లడించారు. అయితే అధిక ద్రవ్యోల్బణం పట్ల ఫెడ్ ఆందోళన వ్యక్తం చేసింది. మార్కెట్ చాలావరకూ పరిమితశ్రేణిలో కదలాడిందని, ఆటోమొబైల్ కంపెనీలు అవుట్‌పెర్‌ఫార్మ్ చేశాయని నాయర్ చెప్పారు.






