27-09-2025 01:58:45 AM
-లఫంగి రాజకీయాలు చేయకు
-ప్రభుత్వ విప్ ఐలయ్యపై తుంగతుర్తి ఎమ్మెల్యే సామెల్ ఫైర్
-మదర్ డెయిరీ డైరెక్టర్ల ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌తో కుమ్మక్కయ్యారని ఆరోపణలు
-యాదాద్రి కాంగ్రెస్‌లో ముసలం
యాదాద్రి భువనగిరి, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీలో ముసలం పుట్టింది. ఆ పార్టీ ఎమ్మెల్యేల మధ్య ఉన్న విభేదాలు భగ్గుమన్నాయి. లఫంగ రాజకీయాలు, రాజకీయ వ్యభిచారాలు. అపవిత్ర పొత్తులు కాంగ్రెస్ పార్టీని నాశనం చేయడానికి పన్నుతున్న కుట్రలు అంటూ తీవ్ర పదజాలాలతో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్, ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంజీవరెడ్డిలపై తీవ్ర పదజాలాలతో విరుచుకుపడ్డాడు.
భువనగిరి పట్టణంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి ఎమ్మెల్యే మందుల సామెల్ మోత్కూరు మండలానికి చెందిన కాంగ్రెస్ ముఖ్య నాయకులతో హాజరై మాట్లాడారు. ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూనే నేను చెప్పేది వైరల్, వైరల్ కావాలి అంటూ విలేకరులకు సూచించారు. మదర్ డెయిరీకి చెందిన ముగ్గురు డైరెక్టర్ల ఎన్నికల్లో విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంజీవరెడ్డి.. సీఎంకు, పీసీసీ అధ్యక్షుడికి తెలవకుండా బీఆర్‌ఎస్ పార్టీతో కుమ్మక్కై పొత్తు పెట్టుకుని ఆ పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు చేశారు.
సంజీవరెడ్డి బంధువైన బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి మోత్కూర్‌కు చెందిన లక్ష్మీనరసింహారెడ్డిని గెలిపించడానికి పొత్తు పెట్టుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీని నాశనం చేయడానికి ఐలయ్య కుట్ర పన్నాడని ఆవేశంగా అన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్ నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ దృష్టికి తీసుకుపోతానని అన్నారు. మదర్ డెయిరీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థి గెలిస్తే నైతిక బాధ్యత వహించి బీర్ల ఐలయ్య రాజీనామా చేయాలని సూచించారు.
పార్టీ కార్యకర్తల నుంచి ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. బీర్ల ఐలయ్య లఫంగ రాజకీయాలు చేస్తూ రాజకీయ వ్యభిచారానికి పాల్పడుతున్నాడని మండిపడ్డారు. సమావేశంలో పార్టీ మోత్కూరు మండల అధ్యక్షుడు వంగాల స్వామి, నాయకులు పైళ్ల సోమిరెడ్డి, వెంకటేశ్వర్లు, కంచర్ల యాదగిరిరెడ్డి, రామచందర్ పాల్గొన్నారు.