27-07-2025 12:06:12 AM
న్యూఢిల్లీ, జూలై 26: విద్యార్థుల మానసిక ఆరోగ్యం పట్ల సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వారి మానసిక ఆరోగ్యాన్ని కాపాడాలని, ఒత్తిడికి లోనై బలవన్మరణాలకు పాల్పడకుండా నివారించాలని ఆదేశిం చింది. 100 మంది విద్యార్థులున్న ప్రతి విద్యాసంస్థ తప్పనిసరిగా క్వాలిఫైడ్ కౌన్సెలర్ లేదా సైకాలజిస్ట్, సామాజిక కార్యకర్తను నియమించుకొని విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇప్పించాలని నిర్దేశించింది.
ఈ విషయమై సుప్రీం 15 అంశాలతో మార్గదర్శకాలు జారీ చేసింది. విశాఖపట్నంలోని ఒక కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో నీట్ శిక్షణ పొందుతున్న పశ్చిమబెంగాల్ యువతి అనుమానాస్పద మృతిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలంటూ నమోదైన కేసులో సుప్రీం తన నిర్ణయాన్ని వెల్లడించింది.
ఇవి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలు, కోచింగ్ సెంటర్లు, రెసిడెన్షియల్ విద్యాసంస్థలు, హాస్టళ్లకు వర్తిస్తాయని స్పష్టం చేసింది. తీర్పు కాపీని రాష్ట్రాలకు పంపి, ఈ మార్గదర్శకాల అమలుకు వెంటనే చర్యలు చేపట్టేలా చూడాలని ఆదేశించింది.