15 April, 2026 | 12:06 PM

Breaking News

ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •   అంబేద్కర్ భారత రాజ్యాంగ శిల్పి   •  

గుర్తులు వచ్చాయి.. ప్రచారం మొదలైంది

05-02-2026 12:00 AM

కాంగ్రెస్ రెబల్ బెడద...

జిల్లాలో విచిత్రమైన పొత్తులు...

కొత్తగూడెం కార్పొరేషన్ బరిలో 354 మంది 

భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీలకు జరుగుతున్న ఎన్నికల్లో మంగళవారం అభ్యర్థుల దరఖాస్తుల ఉపసంహరణ అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థుల సంఖ్య ఖరారు అయింది. దీంతో రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు ప్రచారంపై దృష్టి సారించారు. బుధవారం ఆయా పార్టీల ముఖ్య నేతలు అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రచారాన్ని నిర్వహించారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 60 డివిజన్లలో 354 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు వారి వారి డివిజన్లో ప్రచారం నిర్వహించారు.

సిపిఐ, టిడిపి కూటమి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ కొత్తగూడెం ఎమ్మెల్యే కూణంనేని సాంబశివరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి షాబెర్ పాషా, తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రచారంలో పాల్గొన్నారు. బిఆర్‌ఎస్ అభ్యర్థుల తరఫున మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అశ్వరావుపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, ఇల్లందు మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయాన్ని కోరుతూ ఎమ్మెల్యే కోరం కనకయ్యలు ప్రచారాన్ని నిర్వహించారు. అధికార కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లో ప్రచారం చేస్తుంటే, విపక్షాలు కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ ప్రచారాన్ని నిర్వహించారు. దీంతో జిల్లా వ్యాప్తంగా ఎన్నికల వేడి నెలకొంది. 

కాంగ్రెస్‌లో రెబల్స్..

కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ లో అధికార పార్టీ టిక్కెట్ ఆశించే భంగపడిన అభ్యర్థులు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలవడంతో కాంగ్రెస్లో రెబల్స్ బెడద మొదలైంది. బిఆర్‌ఎస్ లోను టిక్కెట్ ఆశించి నిరాకరించిన కార్యకర్తలు ఆ పార్టీపై దుమ్మెత్తి పోస్తున్నారు. తెలుగుదేశం పార్టీ సిపిఐ పొత్తులో పోటీ చేస్తున్నప్పటికీ సైకిల్ గుర్తు లేకపోవడంతో తెలుగుదేశం అభ్యర్థులు కంకి కొడవలి గుర్తుపైన ప్రచారం నిర్వహించడం తెలుగుదేశం అభిమానుల్లో ఒకంత ఆవేదన నెలకొంది. 

విచిత్రమైన పొత్తులు..

ఎన్నికలవేళ రాజకీయ పార్టీలు సిద్ధాంతాలను పక్కకు పెట్టి గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎన్నికల పొత్తులు విచిత్రంగా కనిపిస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ సిపిఐ బిఆర్‌ఎస్ పార్టీలు ఒక కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలో ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం కార్పొరేషన్ జరుగుతున్న ఎన్నికల్లో సిపిఐ టిడిపి తో పొత్తు పెట్టుకోగా, కాంగ్రెస్, సిపిఎంతో కూటముగా ఏర్పడింది. జిల్లాలో అశ్వరావుపేట  మున్సిపాలిటీకి జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ , సిపిఐ సిపిఎం పార్టీలతో కూటమిగా ఏర్పడగా, బిఆర్‌ఎస్ టిడిపి మరోకూటమిగా పోటీకి తలబడుతోంది. దీంతో జిల్లా వ్యాప్తంగా  విచిత్రమైన పొత్తులు నెలకొన్నాయి.