21-08-2025 01:10:14 AM
ఆందోళన చెందుతున్న ప్రజలు
పట్టించుకోని అధికారులు
కామారెడ్డి, ఆగస్టు 20 (విజయక్రాంతి): కుక్క కాటు తో కోతి గాట్లతో జనం ఆసుపత్రి ఫాలవుతున్నారు. ఆసుపత్రిలో అందుబాటులో హేమోగ్లోబిన్ టీకాలు లేక బాధితులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు మాత్రం కుక్కల, కోతుల బెడదను నియంత్రించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అధికారుల నియంత్రణ చర్యలు కనిపించడం లేదు.
కామారెడ్డి జిల్లాలో కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గంలోని పలు మండల కేంద్రాలు, పట్టణ కేంద్రాలు, గ్రామాల్లో ప్రజలు ఇల్లల్లో నిశ్చితంగా ఉండే పరిస్థితి లేదు. తలుపు తీస్తే ఏమవుతుందో అనే భయం ఇంటిబయట వస్తువులు, దుస్తులు, నిక్షేపంగా ఉండే పరిస్థితి లేదు. ఇంటి గడప దాటి కాలు బయట పెడదామంటే భయం. ఏ ఉపద్రవం ముంచుకొస్తుందో తెలియదు. భరోసా, భద్రత లేకుండా పోయింది.
దారి వెంట నడిచే పరిస్థితి లేదు. చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు ఇల్లు దాటే పరిస్థితి లేదు. ఓవైపు కుక్కలు హడలెత్తిస్తుంటే మరోవైపు కోతులు బెంబేలెత్తిస్తున్నాయి. కామారెడ్డి ,ఎల్లారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద మున్సిపాలిటీ పరిధి తో పాటు పలు గ్రామాల ప్రజ లు కుక్కలు కోతుల బెడదతో ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుత పరిస్థితి . గుంపులు గుంపులుగా వీధి కుక్కలు వీధుల్లో తిరుగుతు దారిన వచ్చిపోయే ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి.
ప్రజలపై ఎగబడి కరుస్తుండడంతో వీధుల్లో నడవాలంటేనే బెంబేలెత్తుతున్నారు. చిన్నారులు, మహిళలు వృద్ధులు, ఇల్లు వదిలి బయటకు రావాలంటే హడలెత్తిపోతున్నారు. గత నాలుగు రోజుల క్రితం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఒకే కుక్క 20 మందిపై దాడి చేసి గాయాలపాలు చేసింది. ఇటీవల ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని ఇందిరా నగర్ కాలనీలో 8 మంది పై వీధి కుక్కలు దాడి చేసి గాయపడ్డ సంఘటన చోటు చేసుకుంది. అదేవిధంగా కుక్కకాటులకు బలే ఆసుపత్రి పాలైన వారు చాలా సంఖ్యలో ఉన్నారంటే సమస్య తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.
భయపెడుతున్న కోతులు.
అరణ్యంలో ఉండాల్సిన కోతులు మారిన పరిస్థితుల కారణంగా జనారాన్యంలో ప్రవేశించి ప్రజలకు నరకాన్ని చూపెడుతున్నాయి. దుకాణాలపై దాడులకు తెగబడడంతో పాటు. ఇళ్లలోకి చొరబడి దాడులకు దిగుతున్నాయి. ఇంట బయట వస్తువులను ఎత్తుకెళ్లడం ఆరబెట్టిన దుస్తులను చింపడం వంటి కోతి చేష్టలతో ప్రజలు ఇబ్బందులకు గురి అవుతున్నారు.
రహదారుల వెంట వెళ్తున్న వారిపై దాడులకు దిగి గాయపరుస్తున్నాయి. దీంతో కోతులను చూసి ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు. ఒకవైపు కుక్కల బెడద,మరోవైపు కోతుల దాడులతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
కుక్కల కాట్లు, కోతుల గాట్లు.
కుక్కలు, కోతుల దాడుల్లో గాయాలపాలయ ఆసుపత్రిలో చికిత్స పొందిన వారి సంఖ్య ఎక్కువగా ఉండడం గమనార్హం . ఇటీవల కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఒకేరోజు 20 మందికి కుక్క కాటు వేసింది.ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో కుక్కల దాడికి పాల్పడ్డ బాధితులు ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా టీకాలు అందించి వైద్యం చేశారు.
కానీ భారీ గాయాలు అయిన వారికి హిమోగ్లోబిన్ టీకాలు ఆస్పత్రిలో అందుబాటులో లేకపోవడంతో వైద్యులు బాన్సువాడ ,కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. దీంతో బాధితులు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. పట్టణ కేంద్రంతోపాటు గ్రామాల్లోని వీధి కుక్కలు ప్రజలపై దాడులు చేసి గాయపరుస్తున్నప్పటికీ మున్సిపాలిటీ అధికారులు. గ్రామపంచాయతీ అధికారులు చర్యలు చేపట్టకుండా చోద్యం చూస్తుండడం విమర్శలకు తావిస్తోంది.