calender_icon.png 1 May, 2025 | 8:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీకి బలం

30-04-2025 12:00:00 AM

యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 29 ( విజయ క్రాంతి ): కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే బలమని వారి లేనిదే పార్టీ లేదని వారి శ్రమ, త్యాగాల ఫలితంగానే నేడు తెలంగాణలో అధికారంలోకి వచ్చామని ఆ పార్టీ నాయకులు అన్నారు. అధిష్టానం ఆదేశాల మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా పార్టీ సంస్థాగత సమావేశం జిల్లా అధ్యక్షులు అండం సంజీవరెడ్డి అధ్యక్షతన ప్రైవేట్ హోటల్లో మంగళవారం నాడు జరిగింది. ఈ సమావేశానికి జిల్లా నలుమూలల నుండి ముఖ్య నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ త్వరలోనే వార్డు, గ్రామ, మండల, జిల్లా కమిటీలను. అందరి అభిప్రాయాలతో ఏకగ్రీవంగా నియమించడం జరుగుతుందని తెలిపారు.

వార్డు కమిటీ మెంబర్ కు తెలవకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులను ఏ ఒక్కరు కలవడానికి వీలుండదని కమిటీ నాయకులు పార్టీకి బాసులని పేర్కొన్నారు. వారు కూడా పార్టీని బూత్ స్థాయి నుంచి పటిష్టపరిచి ప్రజా సమస్యలపై నిరంతరం ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించడానికి కృషి చేయాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరు అభిప్రాయాలు తీసుకుని గెలుపు గుర్రాలకే టికెట్ ఇవ్వడం జరుగుతుందని స్పష్టం చేశారు.

కష్టపడే కార్యకర్తలను గుర్తించి వారికి తగిన న్యాయం పార్టీ కల్పిస్తుందని అన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో నూటికి నూరు శాతం స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకోవడానికి కార్యకర్తలు ఎక్కడికక్కడ పటిష్టంగా పనిచేయాలన్నారు. గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని దోచుకుని సర్వనాశనం చేసిందని ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సారథ్యంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని కాంగ్రెస్ నాయకులు అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో మంచి పథకాలను ప్రవేశపెట్టిందని అవన్నీటిని ప్రజల్లోకి తీసుకువెళ్లి ఓట్లుగా మలుచుకోవాలన్నారు సన్న బియ్యం, మహిళకు ఉచిత బస్సు సౌకర్యం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 రూపాయల వరకు ఉచిత కరెంటు, రెండు లక్షల రుణమాఫీ, ఈ విధంగా ఎన్నో అద్భుతమైన పథకాలను తమ ప్రభుత్వం చేపట్టిన నేపథ్యంలో  ప్రచారం చేసుకుని ప్రజల మెప్పు పొంది రానున్న స్థానిక ఎన్నికల్లో విజయం సాధించడానికి కృషి చేయాలన్నారు.

ఈ సమావేశంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, యంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి,  ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామ్యూల్ , ఉమ్మడి నల్గొండ జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ కసిరెడ్డి నారాయణరెడ్డి, తెలంగాణ రాష్ట్ర మహిళా కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు , జిల్లా మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ, జిల్లా గ్రంథాలయం చైర్మెన్ అవిస్ చిస్తీ, టిపిసిసి ప్రధాన కార్యదర్శి ప్రమోద్ కుమార్, టీపీసీసీ డెలిగేట్ తంగళ్ళపల్లి రవికుమార్, మార్కెట్ కమిటీ చైర్మెన్లు, మండల అధ్యక్షులు, బ్లాక్ అధ్యక్షులు, మాజీ యంపిపిలు, జడ్పిటిసీలు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.