11-04-2025 07:30:12 PM
సబ్ కలెక్టర్ కిరణ్మయి..
బాన్సువాడ (విజయక్రాంతి): ఇసుక అక్రమ రవాణా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కామారెడ్డి జిల్లా బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి తెలిపారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ... ఈనెల 10న సాయంత్రం బాన్సువాడ సబ్ కలెక్టర్ డోంగిలి నుండి బిర్కూర్ వైపు రెండు ట్రాక్టర్లలో అక్రమంగా ఇసుక నింపేందుకు ప్రయత్నిస్తుండగా పరిశీలించి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బిర్కూర్ బ్రిడ్జి క్రింద నదిలో కుర్ల శివారులో (02) ట్రాక్టర్ లలో అక్రమంగా ఇసుక నింపుటకు ప్రయత్నించుచుండగా గమనించి వాటిని పట్టుకొనుటకు ప్రయత్నించగా వారు పారిపోయినారు.
ఇసుక అక్రమ రవాణా కొరకు వాడుచున్న దారిని గమనించి శుక్రవారం దొంగ్లీ, బీర్కూర్ మండలాల తహసీల్దార్ లు, సబ్ ఇన్స్పెక్టర్ లు, రెవిన్యూ పోలీసు సిబ్బంది, సబ్ కలెక్టర్ సమక్షంలో జెసిబి వెహికిల్ ద్వారా అక్రమ ఇసుక రవాణా చేయు దారిని తొలగించారు. అక్రమ ఇసుక రవాణాను అరికట్టవలసిందిగా ఉన్నతాధికారులు ఆదేశించడంతో చర్యలు చేపట్టినట్లు సబ్ కలెక్టర్ తెలిపారు. మంజీరా నదిలో ఈ దారిని మళ్ళీ ఏర్పాటు చేసినా, ఇసుక అక్రమ రవాణా చేసినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని సబ్ కలెక్టర్ అక్రమ ఇసుక రవాణా దారులను హెచ్చరించారు. అక్రమంగా ఇసుకను తరలించే వాహనాలను సీజ్ చేసి వాహనా యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు.