పనితీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు
- మంత్రి జూపల్లి హెచ్చరికలు
నాగర్‌కర్నూల్, జూన్ 27 (విజయక్రాంతి): ప్రభుత్వ అధికారులు పనితీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజాపాలనలో ప్రతిఒక్కరిలో మార్పు రావాల్సిందేనని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు. జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్‌లో గురువారం కలెక్టర్ బదావత్ సంతోష్ అధ్యక్షతన అన్ని శాఖల అదికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా మేజర్, మైనర్ ఇరిగేషన్, విద్యుత్, వైద్యరోగ్య, సివిల్‌సప్లయ్ శాఖల అధికారులతో చర్చించారు.
కృష్ణా జలాలను వాడుకునేందుకు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు నిర్మించాలని, అందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. విద్యుత్ అధికారులు, తహసీల్దార్లు రైతులతో దురుసుగా ప్రవర్తిస్తున్నారని తెలియవచ్చిందని, ఆ తరహా ప్రవర్తనను సీరియస్‌గా తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో ఎమ్మెల్సీలు కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, గోరటి వెంకన్న, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, రాజేష్‌రెడ్డి, అదనపు కలెక్టర్ సీతారామారావు, ఫారెస్ట్ ఆఫీసర్ రోహిత్ గోపిడి పాల్గొన్నారు.




