08-10-2025 12:06:14 AM
యాదాద్రి భువనగిరి అక్టోబర్ 7 (విజయక్రాంతి): 2025 - 26 ఖరీఫ్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో, ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా సక్రమంగా నిర్వహించాలని, అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో 2025-2026, ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోళ్ల కేంద్రాల ఏర్పాటు నిర్వహణ కోసం రెవిన్యూ అదనపు కలెక్టర్ వీరా రెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు , సంబంధిత అధికారులతో వరి కొనుగోలు సన్నాహక సమావేశంలో అధికారులకు శిక్షణ తరగతులు కలెక్టరేట్ లో నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రానున్న ఖరీఫ్ సీజన్లో ముందస్తు ప్రణాళిక ప్రకారం జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల కేంద్రాల ఏర్పాటు నిర్వహణ సంబంధిత అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో కలిసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులందరూ టార్పాలిన్ కవర్లు ఎక్కువగా ఉంచుకోవాలన్నారు.
కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంట వెంటనే రైస్ మిల్లులకు పంపే విధంగా ప్రణాళిక ప్రకారం లారీలను, హమాలీలను సిద్ధంగా ఉంచుకునేలా చర్యలు తీసుకోవాలని, కొనుగోళ్లకు సంబంధించి దాన్యం డబ్బుల ను రైతుల ఖాతాలలో వెంటనే జమ అయ్యేందుకు చర్యలు తీసుకోవాలని, కేంద్రాలలో నిబంధనల ప్రకారం అన్ని సౌకర్యాలు కల్పించడం కోసం ఆన్ని శాఖల సమన్వయంతో ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని ఆయన ఆదేశించారు.వరి ధాన్యం క్వింటాలకి ఏ గ్రేడ్ కు రూ.2389/-, సాధారణ రకం క్వింటాలకి 2369/- చొప్పున ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించిందని అన్నారు. ఈ సమావేశంలో డి ఆర్ డి ఓ నాగిరెడ్డి,డిసిఓ శ్రీధర్, పౌర సరఫరాల సంస్థ మేనేజర్ హరికృష్ణ, డిఏఓ రమణ రెడ్డి, సివిల్ సప్లై రోజారాణి, , తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థుల మెనూ ఉల్లంఘిస్తే బాధ్యులపై కఠినచర్యలు
కలెక్టర్ హనుమంతరావు
యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 7 (విజయక్రాంతి): మెనూ ప్రకారం రుచికరమైన భోజనాన్ని విద్యార్థులకు అందించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. మంగళవారం ఆలేరు మండలం శారాజిపేట గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్ ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. స్కూల్ లో మధ్యాహ్నం భోజనంలో విద్యార్థులకి మోను పాటించకుండా చారు తో పెట్టడంతో సంబంధిత ఏజెన్సీ పై ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్.స్కూల్ లో కమిటీ సభ్యులు గా ఉన్న ఉపాధ్యాయులు కూడా రోజు మధ్యాహ్న భోజనం లో విద్యార్థులకి పెట్టే ఆహారం మెనూ ప్రకారం ఉందా లేదా పరిశీలించాలని అన్నారు.
స్కూల్ లో మొత్తం ఎంత మంది విద్యార్థులు ఉన్నారని, పదవ తరగతిలో ఎంత మంది విద్యార్థులు ఉన్నారని ప్రధానోపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి నుండి పదవ తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షల కోసం సిద్ధం అయ్యేలా విద్యా బోధన చేయాలి అన్నారు. సబ్జెక్టుల వారీగా విద్యార్థులకు అర్థమయ్యేలా బోధనను అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.