01-10-2025 12:32:28 AM
జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి రాహుల్ రాజ్
మెదక్, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి):స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్నికల ప్రవర్తన నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయాలని మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం అదనపు కలెక్టర్ నగేష్, మెదక్ అదనపు ఎస్పీ మహేందర్ తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మెదక్ జిల్లాలో 21 మండలాలు, 492 గ్రామపంచాయతీలు 4220 వార్డులు ఉన్నాయన్నారు.
జిల్లాలో 21 జడ్పిటిసి, 190 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయనీ,జిల్లాలో 5,23,327 మంది ఓటర్లు ఉన్నారని చెప్పారు. అందులో 251,532 పురుష ఓటర్లు ఉన్నారు..271,787 మహిళా ఓటర్లు, ఇతరులు 8 మంది ఉన్నట్లు తెలిపారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ లకు రెండు దశలలో పోలింగ్ జరుగనుందని, ఎంపీటీసీ, జడ్పీటీసీ రెండు దశల్లో జరిగే ఎన్నికల కోసం 1052 పోలింగ్ కేంద్రలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 2846 బ్యాలెట్ బాక్స్ సిద్ధం చేశామన్నారు. ఎన్నికల కోసం 6,600 మంది సిబ్బందికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందని, మొదటి దశలో మెదక్ రెవెన్యూ డివిజన్ పరిధి 10 మండలాల్లో ఉన్న 99 ఎంపీటీసీ స్థానాలకు, 10 జడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ జరుగుతుందని సూచించారు. అక్టోబర్ 9 నుండి 11 వరకు ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల స్వీకరణ, 12న పరిశీలన, తుది జాబితా అక్టోబర్ 15 న వెల్లడి అవుతుందన్నారు.
పోలింగ్ అక్టోబర్ 23 జరుగుతుందని, కౌంటింగ్ నవంబర్ 11న ఉంటుందని సూచించారు. రెండో దశ నర్సాపూర్ డివిజన్ లోని 5 మండలాలు, తూప్రాన్ డివిజన్ లోని 6 మండలాల పరిధిలోని 11 జడ్పీటీసీ, 91 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరుగుతుందన్నారు. అక్టోబర్ 13 నుండి 15 వరకు నామినేషన్ స్వీకరణ, అక్టోబర్ 19న అభ్యర్థుల తుది జాబితా, అక్టోబర్ 27న పోలింగ్, నవంబర్ 11న కౌంటింగ్ ఉంటుందన్నారు.
గ్రామ పంచాయతీ ఎన్నికలు రెండు దశల్లో మెదక్ డివిజన్ 10 మండలాల్లో 244 పంచాయతీ, 2124 వార్డులకు పోలింగ్ ఉంటుందన్నారు. నామినేషన్ స్వీకరణ అక్టోబర్ 21నుండి 23 వరకు,.27న తుది జాబితా విడుదల అవుతుందన్నారు. నవంబర్ 4న పోలింగ్, అదే రోజు కౌంటింగ్ నిర్వహించబడుతుందన్నారు. రెండవ విడతలోనర్సాపూర్, తూప్రాన్ డివిజన్ లోని 11 మండలాల్లోని 248 పంచాయతీ కు, 2096 వార్డులకు నామినేషన్ స్వీకరణ అక్టోబర్ 25 నుంచి 27 వరకు, ఉపసంబరణ అక్టోబర్ 31, నవంబర్ 8న పోలింగ్ అదే రోజు కౌంటింగ్ ఉంటుందన్నారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో వెంటనే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వస్తుందని, దీనిని కట్టుదిట్టంగా అమలు చేయాలనిఅన్నారు. ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో తక్షణమే ఎన్నికల ప్రవర్తన నియమావళి (ఎన్నికల కోడ్) అమలులోకి వస్తుందని సూచించారు.