30-01-2026 02:03:39 PM
జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్
నాగర్ కర్నూల్, (విజయక్రాంతి): జిల్లాలో గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాల అక్రమ రవాణా, క్రయ విక్రయాలు పూర్తిగా అరికట్టేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశించారు. మాదకద్రవ్యాల వెనుక ఉన్న మూలాలను గుర్తించి, అంతర్గత సమాచారంతో కఠినం వ్యవహారించి జిల్లాను మాదకద్రవ్య రహితంగా మార్చాలాన్నారు.
శుక్రవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి మాదకద్రవ్యాల నియంత్రణ కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. గతేడాది జిల్లాలో నమోదైన 9 మాదకద్రవ్యాల కేసులపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఆయా కేసుల పురోగతిని అదనపు ఎస్పీని అడిగి తెలుసుకున్నారు. మాదకద్రవ్యాల రవాణా, సరఫరా, విక్రయాల్లో పాల్పడే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకొని తప్పనిసరిగా శిక్ష పడేలా చూడాలని ఆదేశించారు. ప్రస్తుతం సమాజాన్ని ఆల్కహాల్, గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలు తీవ్రంగా పీడిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
యువతతో పాటు అధికారులు కూడా మత్తు పదార్థాలకు దూరంగా ఉండేలా కృషి చేయాలన్నారు. ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగుతున్న విద్యార్థులు, యువత చిన్న తప్పిదంతోనే భవిష్యత్తును నాశనం చేసుకునే ప్రమాదం ఉందని హెచ్చరించారు. తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. జిల్లాలో మత్తు పదార్థాల అక్రమ రవాణాపై పటిష్ఠ నిఘా ఏర్పాటు చేయాలని, గ్రామ స్థాయిలోనూ, విద్యా సంస్థల్లోనూ విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. పాఠశాలలు, కళాశాలల పరిసరాల్లో మత్తు పదార్థాల విక్రయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. ఈ వ్యవహారాల్లో పాఠశాల సిబ్బంది లేదా ఉద్యోగుల ప్రమేయం ఉన్నట్లయితే, ఉద్యోగం నుంచి పూర్తిస్థాయిలో తొలగించేలా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మత్తు పదార్థాలకు బానిసైన వారికి ఆసుపత్రుల్లో చికిత్సతో పాటు కనీసం ఆరు నెలల పాటు కౌన్సిలింగ్ నిర్వహించి, పూర్తిస్థాయిలో మాదకద్రవ్యాల నుంచి దూరం చేసేలా చర్యలు తీసుకోవాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు పి. అమరేందర్, దేవ సహాయం, అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు, డీఎంహెచ్ఓ డాక్టర్ రవి నాయక్, డీఈఓ రమేష్ కుమార్, అచ్చంపేట డీఎస్పీ శ్రీనివాసులు, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.