22 June, 2026 | 3:03 AM

తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేర్చేందుకు కృషి

22-06-2026 12:00 AM

ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం 

మహబూబాబాద్, జూన్ 21 (విజయక్రాంతి): తెలంగాణ తొలిదశ, మలి దశ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులకు న్యాయం చేయడానికి ఉద్యమకారుల గుర్తింపు కమిటీ ఏర్పాటు చేయబడిందని  ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సభ్యుడు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఆదివారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్తి రెడ్డిగార్డెన్ లో మహబూబాబాద్ ఉద్యమ కారుల ఆత్మీయ సమ్మేళనం ఉద్యమ జేఏసీ కన్వీనర్ డాక్టర్ డోలి సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలి దశ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన ఉద్యమకారులు ఇంకా కొంత మంది ఉన్నారని, ఆ కుటుంబాలకు తప్పనిసరిగా న్యాయం జరుగుతుందని, అలాగే మలిదశ ఉద్యమంలో కూడా మరణించిన వారి కుటుంబాలకు, గాయపడిన వారు, జైలుకు వెళ్లిన వారు కేసుల పాలైన వారికి కూడా తగు న్యాయం జరిగే విధంగా కమిటీలో చర్చిస్తామని తెలిపారు.

అలాగే కేసులు లేకుండా ఉద్యమానికి అన్ని రకాలుగా ఇతోధికంగా మేధోపరమైన, కళాకారులు, జర్నలిస్టులు, రచయితలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు అన్ని రకాలుగా సహకరించారని అలాంటి వారిని గుర్తించుటకు ప్రతిపాదనలు వస్తున్నాయని, వాటన్నిటినీ పరిశీలించి ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి న్యాయం చేసేలా కమిటీలో మాట్లాడతానని తెలిపారు.

ప్రజలంతా సహకరిస్తేనే తెలంగాణ ఉద్యమం విజయవంతం అయిందని, ప్రజల అభివృద్ధి తోటే ఉద్యమకారుల అభివృద్ధి ముడిపడి ఉంటుందని, ఈ విషయం ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని, ఉద్యమకారులు కూడా ప్రజల అభివృద్ధికి తోడ్పడాలని కోరూకోవాలని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో సర్ పేరుతో ఓటర్ల వెరిఫికేషన్ కొనసాగుతుందని ఈ పేరుతో ఓట్లు తొలగించే ప్రక్రియ ఉంటుందని, ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండి ఓటు హక్కు కోల్పోకుండా ప్రయత్నించాలని తెలిపారు. ఓటు కోల్పోవడం 

అంటే పౌర సత్వం కోల్పోయినట్టేనని ప్రభుత్వం అనవసర వాదనలు పెట్టి, 2002 జాబితాకు 2024 జాబితాకు ముడిపెట్టి ఓటర్ల పరిశీలన అంటే సరైన విధానం కాదని దీన్ని నిలువరించడానికి రాజకీయ పార్టీల ప్రతినిధులు ఓటర్లకు అందుబాటులో ఉండి వారికి కావాల్సిన సహాయ సహకారాలు అందించాలని కోరారు. అలాగే ఇటీవల ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులు హైదరాబాదులో తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నారని ఇది సహేతుకం కాదన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యమకారుల జేఏసీ లోని  వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఉపాధ్యాయ, విద్యార్ధి సంఘాలు, కుల, కళాకారుల సంఘాలు, అడ్వకేట్స్ సంఘం బద్రులు పాల్గొన్నారు.