ఎన్నికలకు పటిష్ఠ బందోబస్తు
అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు
బందోబస్తు కోసం 73,414 మంది పోలీసులు
సరిహద్దుల చెక్‌పోస్టుల వద్ద విస్తృతంగా తనిఖీలు: డీజీపీ
హైదరాబాద్, మే 12 (విజయక్రాంతి): రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ప్రజలంతా నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని డీజీపీ రవిగుప్తా తెలిపారు. ఆదివారం మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియకు ఎలాంటి అవాంతరాలు కలిగించినా సహించేదిలేదని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల బందోబస్తు కోసం 73,414 సివిల్ పోలీసులు, 500 సెక్షన్ల టీఎస్‌ఎస్‌పీ సిబ్బంది, 164 కంపెనీల కేంద్ర బలగాలు, 3 కంపెనీల తమిళనాడు పోలీసులు, 2,088 మంది ఇతర శాఖల సిబ్బందితో పాటు 7 వేలమంది హోంగార్డులు విధులకు హాజరైతారని తెలిపారు. ఎన్నికల నిబంధలను ప్రకారం తనిఖీ కేంద్రాల నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేశామని, ఇప్పటికే 482 ఫిక్స్‌డ్ స్టాటిక్ బృందాలు, 462 స్టాటిక్ సర్వేలైన్స్ టీమ్‌లు, 89 అంతరాష్ట్ర సరిహద్దు తనిఖీ కేంద్రాలు, 173 అంతర్ జిల్లా తనిఖీ కేంద్రాలు పనిచేస్తున్నట్లు చెప్పారు. మద్యం, నగదు, తాయిలాల పంపిణీ చేయకుండా నిఘా విస్తృతం చేసినట్లు వెల్లడించారు.
రాష్ట్రంలో ఎన్నికల కోడ్ మార్చి 16 నుంచి అమలుల్లోకి రావడంతో ఇప్పటివరకు రూ. 186.12 కోట్ల విలువైన సొమ్ము స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీటిలో రూ. 93.94 కోట్ల నగదు, రూ.10.07 కోట్ల విలువైన మద్యం, రూ. 7.86 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలు, రూ. 62.77 కోట్ల విలువైన ఆభరణాలు, రూ. 11.48 కోట్ల విలువైన పంపిణీ సామాగ్రి ఉన్నట్లు పేర్కొన్నారు. మొత్తం 8,863 మంది కేసులు నమోదు కాగా, వీటిలో అబ్కారీ శాఖలో 8,044 కేసులు చేసినట్లు, నార్కోటిక్స్ కేసులో 293, ఆర్‌పీ యాక్ట్ కింద 53 కేసులు నమోదైనట్లు చెప్పారు. 34,526 మందిని బైండోవర్ చేశామన్నారు.
అదే విధంగా తమ కార్యాలయంలో ఆదివా రం 7 గంటల నుంచి కమాండ్ కంట్రోల్‌రూ మ్ అందుబాటులోకి వస్తుందన్నారు. పోలిం గ్ ముగిసి, ఈవీఎంలను స్ట్రాంగ్‌రూమ్‌లోకి తరలించే వరకు పనిచేస్తుందన్నారు. పోలింగ్ సిబ్బంది కోసం కమ్యూనికేషన్ నెట్‌వర్క్ ఏర్పాటు చేసినట్లు, ఎక్కడైనా అవాంచనీయ సంఘటనలు జరిగితే అప్రమత్తమైన పరిస్థితులు అదుపులోకి తెస్తామని తెలిపారు.




