06-12-2024 01:39:38 AM
* విచ్చలవిడిగా అధికారుల అనుమతులు
లక్షెట్టిపేట, డిసెంబర్ 5: మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీలో కాసులకు కక్కుర్తి పడిన అధికారులు చెరువు శిఖం, బఫర్‌జోన్‌లు అనే తేడాలేకుండా భవనాల నిర్మాణాలకు విచ్చలవిడిగా అనుమతులు ఇచ్చారు. సీఐటీయూ జిల్లా నాయకులు దుంపల రంజిత్ ప్రజావాణిలో ఫిర్యాదు చేయడంతో అధికారుల్లో చలనం మొదలై సర్వే బాట పట్టారు. లక్షెట్టిపేట, ఇటిక్యాలకు మధ్య గల పెద్ద చెరువు ఇటిక్యాల చెరువు. ఈ చెరువులో నిండు వేసవిలో సైతం నీరు నిలువ ఉంటాయి. వర్షా కాలంలో జాతీయ రహదారి వద్ద వరకు నీరు నిలిచి ఉంటుంది. అలాంటి ప్రదేశం(బఫర్ జోన్)లో వందల సంఖ్యలో విద్యార్థులు విద్యనభ్యసించే ప్రైవేటు కార్పొరేటు (శ్రీ చైతన్య) పాఠశాల నిర్మాణానికి అధికారులు అనుమతులు ఇచ్చారు. వేగంగా నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించారు.
మొదలైన సర్వే
బఫర్ జోన్‌లో వెంచర్లు, నిర్మాణాలు చేపడుతున్నట్లు పలుమార్లు పత్రికల్లో వచ్చిన కథనాలకు అధికారులు హడావిడి చేసి, అక్రమార్కుల నుంచి మామూళ్లు తీసుకుని మమా అనిపించారనే ఆరోపణలున్నాయి. అయితే ఇటీవల బఫర్‌జోన్‌లో శ్రీ చైతన్య పాఠశాల నిర్మించారంటూ ఫిర్యాదు అందడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు గురువారం రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ శాఖల అధికారులు తిరిగి సర్వే ప్రారంభించారు. అయితే ఫిర్యాదులు వచ్చినప్పుడల్లా సర్వే చేసి వెళ్తున్నారే తప్పా ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుందా! లేదా ఏమైన చర్యలుంటాయా! అనేది వేచిచూడాలి.
చెరువులో నిర్మాణాలకు అనుమతులు
చెరువు బఫర్, శిఖం భూముల్లో విచ్చలవిడిగా నిర్మాణాలు జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడంలేదు. అనుమతులు లేకుండానే పాఠశాల నిర్మాణం జరుగుతుందని గతంలో ఎంఈవో కాసుల రవీందర్‌కు విద్యార్థి సంఘం నాయకులు ఫిర్యాదు చేస్తే గదులను సీజ్ చేసి వదిలేశారు. ఇటీవల ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు సైతం చెరువు ఆక్రమణల విషయంలో పార్టీలకతీతంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కానీ ఆయన మాటలను సైతం కబ్జాదారులు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ఈ విషయమై తహసీల్దార్ దిలీప్‌కుమార్‌ను వివరణ కోరగా సర్వే అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.