calender_icon.png 12 August, 2025 | 10:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫీజు బకాయిలపై విద్యార్థి గర్జన

12-08-2025 01:27:31 AM

  1. ఉన్నత విద్యామండలి ఆఫీసు ముట్టడి
  2. ఎంపీ ఆర్ కృష్ణయ్య, బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో మహాధర్నా

హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 11 (విజయక్రాంతి): బీసీ, ఈబీసీ విద్యార్థులకు రాష్ట్రవ్యాప్తంగా పేరుకుపోయిన రూ.6000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట బకాయిలను వెంటనే విడుదల చేయాలని, ప్రైవేట్ యూనివర్సిటీలలో రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం హైదరాబాద్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయాన్ని తెలంగాణ రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు వేముల రామకృష్ణ, ఎంపీ ఆర్ కృష్ణ య్య నేతృత్వంలో వందలాది మంది విద్యార్థులు ముట్టడించారు. దీంతో పోలీసులకు, విద్యార్థులకు మధ్య తోపులాట, వాగ్వాదం చోటుచేసుకుంది.

ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య ప్రసంగిస్తూ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. “లక్షలాది మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నీరుగారుస్తోంది. ఇతర స్కీముల కోసం లక్షల కోట్లు అప్పు తెస్తున్న ప్రభుత్వం, 14 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు కోసం రూ.6000 కోట్లు అప్పు తేలేదా?‘ అని ప్రశ్నించారు.

ఫీజుల చెల్లింపు కోసం ‘ట్రస్ట్ బ్యాంకు‘ ఏర్పాటు చేస్తామనడం కొత్త నాటకమని, ఈ ప్రతిపాదనను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని ఆయన స్పష్టం చేశారు. ఫీజుల బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు, కళాశాల యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ యూనివర్సిటీలలో బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి నాయకులు శివ, ధనుష్, నంద గోపాల్, ప్రీతం, నిఖిల్, పృధ్వీ గౌడ్ పాల్గొన్నారు.