14 April, 2026 | 11:18 PM

ప్రజా సమస్యలపై నిజాలు రాస్తే బెదిరింపులా?: విద్యార్థి సంఘ నేతలు

14-04-2026 07:04 PM

అచ్చంపేట: ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తూ సమాజ సేవలో ముందుండే పాత్రికేయులపై బెదిరింపులకు దిగడం సరైందికాదని అచ్చంపేట విద్యార్థి సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అచ్చంపేటలో ఆంధ్రప్రభ దినపత్రిక విలేకరి కె.ఎల్. నారాయణరావుపై ఇటీవల ఫోన్లో బెదిరించడం.. పాత్రికేయ వృత్తిని అవమాన పరచడమేనని అన్నారు.  అచ్చంపేటలో జరుగుతున్న వెంచర్లపై జరిగిన అక్రమాలపై ఆంధ్రప్రభ విలేకరి  వార్తా కథనం ప్రచురించగా, దానిని జీర్ణించుకోలేని కొందరు బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేసే పాత్రికేయులను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి చర్యలు చేయడం ప్రజాస్వామ్యానికి ముప్పని విద్యార్థి నాయకులు అభిప్రాయపడ్డారు. పాత్రికేయ వృత్తి పట్ల గౌరవం చూపాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, వార్తలు రాసినందుకు బెదిరింపులకు పాల్పడటం సహించరానిదని అన్నారు. సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు.