16-05-2025 05:09:48 PM
జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
నల్లగొండ,(విజయక్రాంతి): ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు భవిత కేంద్రాలలో అన్ని సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. శుక్రవారం ఆమె నల్గొండ జిల్లా,కనగల్ మండలకేంద్రంలో ఉన్న ప్రాథమిక పాఠశాలను సందర్శించి పక్కనే ఉన్న గదిలో భవిత కేంద్రం ఏర్పాటుకు పరిశీలించారు. అవసరమైతే అదనపు గదిని నిర్మించాలని,ఈ కేంద్రంలో ఫ్రెండ్లీ టాయిలెట్, ర్యాంప్, రైలింగ్, తాగునీరు, వినియోగించుకొనే నీరు, ఫర్నిచర్, కృత్యాధార పద్దతిపై విద్యార్థులకు నేర్పించేందుకు ప్రణాళికతో సహా అన్ని సదుపాయాలు ఉండాలన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ మండలంలోని రామచంద్రాపురంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు.
ప్రతి రోజు 3 లారీలు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు వేగవంతం చేసి పూర్తి చేయాలన్నారు. కాగా ప్రస్తుతం కేంద్రంలో 2 లారీలు పనిచేస్తున్నాయి. కేంద్రానికొచ్చిన ధాన్యంలో తాలు, తరుగును గమనించిన జిల్లా కలెక్టర్ నాణ్యతా ప్రమాణాలతో ధాన్యాన్ని తీసుకు రావాలని రైతులతో తద్వారా మద్దతు ధర పొందవచ్చని తెలిపారు. తాలు, తరుగును తొలగించేందుకు తూర్పారబట్టే యంత్రాలు ఇవ్వడం జరిగిందని, వాటిని వాడుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నల్గొండ ఆర్డీఓ వై.అశోక్ రెడ్డి, జిల్లా పౌర సరఫరాల మేనేజర్ హరీష్, డిఎస్ఓ వెంకటేశ్వర్లు, డిఈఓ బిక్షపతి పాల్గొన్నారు.