02-09-2025 01:04:02 PM
ఎమ్మెల్యే తీరుపై మండిపడ్డ బీఆర్ఎస్ నేతలు..
అదిలాబాద్ (విజయక్రాంతి): ఉమ్మడి జైనథ్ మండలంలోని నూతన బోరజ్ మండలంలో గల తర్నం వాగుపై కొత్త బ్రిడ్జి నిర్మించకముందే ఉన్న పాత బ్రిడ్జిని ఎమ్మెల్యే పాయల్ శంకర్(MLA Payal Shankar) కూల్చి వేయించి ప్రజల రాకపోకలకు మరింత ఇబ్బందులకు గురి చేశారని బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు, జైనథ్ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ వేణుగోపాల్ యాదవ్ ఆరోపించారు. వాగు దాటలేక ప్రజలు పడుతున్న ఇబ్బందులను మంగళవారం పార్టీ శ్రేణులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ యాదవ్ మాట్లాడుతూ... తాత్కాలికంగా ప్రజల రాకపోకల కోసం 4 కోట్లతో నిర్మించిన లో లెవెల్ వంతెన సైతం తరుచూ చిన్నపాటి వర్షం వస్తే చాలు వరదల్లో మునిగిపోతోందన్నారు.
కొత్త వంతెన నిర్మించక ముందే ఉన్న పాత వంతెనను కూల్చివేయడంతో ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. వరదలు వచ్చినప్పుడు కనీసం పాత బ్రిడ్జిపై నుండి కాలినడకన, ద్విచక్ర వాహన రాకపోకలు జరిగేవని ఇప్పుడు దాన్ని కూల్చివేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూన్నారని పేర్కొన్నారు. గతంలో పాయల్ శంకర్ వంతెనకు ఇరువైపుల అంబులెన్స్ లు ఏర్పాటు చేసే వారిని, మరి ఎమ్మెల్యే అయ్యాక అంబులెన్స్ లు ఎందుకు ఏర్పాటు చేయడం లేదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, పురుషోత్తం, ఉశన్న, తదితరులు ఉన్నారు.