02-09-2025 01:54:23 PM
హైదరాబాద్: బీసీ రిజర్వేషన్లపై నిన్న గవర్నర్ వద్దకు అఖిలపక్షం వెళ్లిందని.. బీఆర్ఎస్ నేతలు వచ్చారు కానీ బీజేపీ నేతలు ముఖం చాటేశారని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్(TPCC President Mahesh Kumar Goud) మీడియా సమావేశంలో అన్నారు. కాంగ్రెస్ 3 చట్టాలు తెచ్చినా బీజేపీ అడ్డుపడుతోందని.. బీసీ ఓట్లతో గెలిచిన నాయకులు ఎందుకు స్పందించట్లేదని అన్నారు. బీసీ నాయకులం.. బీసీ బిడ్డలం అని చెప్పుకునే అర్హత ఎక్కడిదని.. కేసీఆర్ కుటుంబం రాష్ట్ర ప్రజల సొత్తు దోచుకుందని అన్నారు. ప్రజా క్షేత్రంలో బీఆర్ఎస్ కు శిక్షపడిందని.. పీసీ కమిషన్ ఘోష్ నివేదికపై తదుపరి చర్యల నిర్ణయం బీజేపీపై ఉందని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో కవిత(MLC Kavitha) భాగస్వామిగా ఉన్నారని.. కాళేశ్వరం అవినీతిపై చర్యలు తీసుకోవాలని కేసీఆర్ ను కవిత ఎప్పుడైనా అడిగారా..? అని విమర్శించారు. కవితకు ఈరోజు కనబడుతున్న అవినీతి.. ఆరోజు ఎందుకు కనబడలేదని.. పంపకాల్లో తేడా జరిగి ఉండవచ్చని.. అవినీతి జరిగింది వాస్తవమని తెలిపారు. వాటాల్లో తేడా తప్ప.. ప్రజా సొమ్ము దుర్వినియోగం జరిగింది వాస్తవమని, కాంట్రాక్టర్ ప్రమేయం ఉంటే దానిపైనా విచారణ జరపాలని సీఎంను కోరుతున్నానని అన్నారు. కవిత వెంట రేవంత్ రెడ్డి ఉన్నారని కేటీఆర్ గుసగుసలాడుతున్నారని.. ఎవరి వెంటో ఉండాల్సిన అవసరం రేవంత్ రెడ్డికి ఏమిటని మండిపడ్డారు. మా వెంటే ఉండేందుకు చాలామంది తహతహలాడుతున్నారని, బీజేపీ అవినీతిపరులందరినీ ఒకే కోణంలో చూస్తున్నమని తెలిపారు. ఎవరినో వెనుకేసుకు రావాల్సిన, వత్తాసు పలకాల్సిన అవసరం మాకు లేదని పేర్కొన్నారు.