02-09-2025 01:11:32 PM
తెలంగాణ అభివృద్ధి కోసం కేసీఆర్ చావడానికి కూడా సిద్ధపడ్డాడు..
మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే..
మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి..
నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలోని రైతాంగానికి యూరియాను అందించలేక కేసీఆర్(KCR)ను బద్నామ్ చేసేందుకే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు పెట్టి నివేదిక పెట్టినట్లు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Former Minister Srinivas Goud), మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి(Former MLA Marri Janardhan Reddy)లు ఆరోపించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద రైతులకు యూరియా ఇవ్వడం లేదని ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత పదివేల కాలంలో తెలంగాణ ప్రజల బాగు కోసం కేసీఆర్ అహో రాత్రులు శ్రమించారని ఒక దశలో చావడానికి అయినా సిద్ధపడ్డారని అలాంటి వ్యక్తిపై కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు పెట్టి నివేదిక ఇవ్వడం దుర్మార్గం అన్నారు.
తెలంగాణ రాష్ట్రాన్ని తిరిగి ఆంధ్ర ప్రాంతంలో కలిపేందుకు అడ్డుగా ఉన్న కేసీఆర్ ను సిబిఐ ఎంక్వైరీ చేయించి అడ్డు తొలగించుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి తండ్రి చాటు పిల్లాడిలా వ్యవహరిస్తూ ప్రజలను రైతాంగాన్ని పట్టించుకోవడంలేదని మాజీ ఎమ్మెల్యే మర్రి ఆరోపించారు. కాంగ్రెస్ నేతల నాగుల్లో తొండలు విడిచేందుకు ప్రస్తుతం రైతాంగం పంటలతో పాటు తొండలను పెంచుతున్నారని అన్నారు. కేసీఆర్ జోలికి వస్తే పెట్రోల్ పోసుకొని తగలబడి పోతామని రైతుల కోసం ఎంతటికైనా తెగిస్తామన్నారు. మరో రెండేళ్లలో తిరిగి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని ఎవరూ భయపడాల్సిన పని లేదంటూ పేర్కొన్నారు.