19-09-2025 08:22:21 AM
మండల విద్యాధికారి బాలునాయక్
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని మండల విద్యాధికారి బి బాలునాయక్ కోరారు. జాజిరెడ్డిగూడెం గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ లో గురువారం తుంగతుర్తి నియోజకవర్గ స్థాయి అండర్-14,17 విభాగాల బాలబాలికలకు వాలీబాల్ పోటీలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక వికాసానికి దోహదం చేస్తాయని,విద్యార్థుల్లోని సృజనాత్మకత శక్తిని,మేధో సంపత్తిని పెంపొందిస్తాయని అన్నారు.
విద్యార్థులు క్రీడల్లో తమ ప్రతిభ పాటలను చాటి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆకాంక్షించారు.17 సంవత్సరాల బాలుర విభాగంలో తుంగతుర్తి జట్టు ప్రధమ,జాజిరెడ్డిగూడెం జట్టు ద్వితీయ స్థానాల్లో గెలుపొందారు.17 సంవత్సరాల బాలికల విభాగంలో తుంగతుర్తి ప్రధమ,జాజిరెడ్డిగూడెం ద్వితీయ విభాగాల్లో గెలుపొందారు.అండర్-14 బాలుర విభాగంలో తుంగతుర్తి ప్రధమ,నాగారం ద్వితీయ,బాలికల విభాగంలో తుంగతుర్తి ప్రధమ,జాజిరెడ్డిగూడెం ద్వితీయ స్థానాల్లో గెలుపొందారు.గెలుపొందిన క్రీడాకారులకు సుతారపు అనిల్ కుమార్ బహుమతులు ప్రధానం చేశారు.ఈ కార్యక్రమంలో మండల నోడల్ అధికారి కుంభం ప్రభాకర్,వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లేష్,పీడీలు లోడంగి సైదులు,దాసయ్య,హెచ్ఎం వెంకటరెడ్డి,బింగి కృష్ణమూర్తి,పీడీలు,పీఈటీలు,క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.