19-09-2025 12:34:17 AM
ఏపీ లిక్కర్ స్కాం
హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 18: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఏపీ లిక్కర్ స్కామ్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దృష్టి సారించింది. ఈ వ్యవహారంలో దాదా పు రూ.3,500 కోట్ల కుంభకోణం జరిగిందని భావిస్తున్న నేపథ్యంలో.. ఈ నిధులు ఏమయ్యాయన్న అంశంపై ముమ్మర దర్యాప్తు చేపడుతోంది. హవాలా రూపంలో ఆయా కంపెనీలకు పెట్టుబడుల రూపంలో మార్చినట్టు సందేహిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే గురువారం తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, న్యూఢిల్లీ రాష్ట్రా ల్లో ఈడీ తనిఖీలు చేపట్టింది. లిక్కర్ స్కామ్ కేసులో నిందితుల సంస్థలు, కార్యాలయాల్లో అధికారులు సోదాలు చేపట్టారు. 5 రాష్ట్రాల్లోని 20 ప్రాంతాల్లో ఈ సోదాలు జరిగా యి. భాగ్యనగరంలోనూ ముమ్మర తనిఖీలు చేపట్టారు. నగరంలోని జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్, పంజాగుట్ట, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్, సైదాబాద్, సికింద్రాబాద్‌లోని వెస్ట్ మారేడుప ల్లిలో ముమ్మరంగా తనిఖీలు కొనసాగాయి.
సికింద్రాబాద్ వెస్ట్ మారేడుపల్లిలోని వెల్డింగ్టన్ ఎన్‌క్లేవ్‌లో నివాసముంటున్న ప్రముఖ వ్యాపారవేత్త బూరుగు రమేశ్, ఆయన కుమారుడు విక్రాంత్ నివాసాల్లో దాదాపు 7 గంటల పాటు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో ఈడీ కీలకపత్రాలను స్వాధీనం చేసుకుంది. కాస్పో లీగల్ సర్వీసెస్, మహదేవ్ జ్యూవెల్లరీస్‌తో పాటు రాజశ్రీ ఫుడ్స్‌లో బూరుగు విక్రాంత్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఈ కంపెనీల్లోకి ఏపీ మద్యం కుంభకోణం వ్యవహారానికి సంబంధించిన నగదును మళ్లించినట్టు ఈడీ గుర్తించినట్టు తెలుస్తోంది.
ఈ సోదాల్లో భాగంగా బూరుగు రమేశ్ నివాసంలో నగదు, షెల్ కంపెనీల పత్రాలు సీజ్ చేసినట్టు తెలుస్తోంది. స్వాధీనం చేసుకున్న పత్రాలు, నగదును హైదరాబాద్ ఈడీ కార్యాలయానికి తరలించారు. లిక్కర్ సిండికేట్లకు అనుకూలంగా వ్యవహరించి, నకిలీ, పెంచిన ఇన్వాయిస్‌ల ద్వారా ముడుపులు చేతులు మారడంలో సహాయపడిన వ్యక్తులు, సంస్థల కార్యాలయాలు, నివాసాలే లక్ష్యంగా ఈ తనిఖీలు జరుగుతున్నాయని ఈడీ వర్గాలు వెల్లడించాయి.
ఈ కేసులో పలువురు కీలక వ్యక్తుల పాత్రపై అధికారులు ఆధారాలు సేకరిస్తున్నారు. కుంభకోణంలో ప్రధాన నిందితుడైన రాజ్ కసిరెడ్డిని ప్రశ్నించి, అతడి నుంచి వాగ్మూలం తీసుకున్నారు. మరోవైపు ఏపీ మద్యం కుంభకోణం కేసులో సిట్ ఇప్పటివరకు 29 మంది వ్యక్తులు, 19 సంస్థలను నిందితులుగా చేర్చి, 12 మందిని అరెస్ట్ చేసింది. వీరిలో ముగ్గురికి బెయిల్ లభించింది.
జయలలిత స్నేహితురాలు శశికళ సంస్థల్లో..
రూ.200 కోట్ల బ్యాంక్ మోసం, బినామీ ఆస్తుల కేసుకు సంబంధించి ఈడీ మరో ఆపరేషన్ చేపట్టింది. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు అత్యంత సన్నిహితురాలైన శశికళకు చెందిన సంస్థల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోదాలు చేపట్టారు. చెన్నై, హైదరాబాద్‌లోని 10 చోట్ల తనిఖీలు చేశారు. జీఆర్‌కే రెడ్డికి చెందిన మార్గ్ గ్రూప్ కార్యాలయాల్లో ఈడీ సోదాలు కొనసాగాయి. జీఆర్‌కే రెడ్డిని శశికళకు బినామీగా అధికారులు భావిస్తున్నారు. ఈ సోదాల్లో కీలకమైన పత్రాలు, డిజిటల్ ఆధారాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.