calender_icon.png 13 November, 2025 | 1:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రష్మిక కెరీర్, సక్సెస్ చూస్తుంటే గర్వంగా ఉంది

13-11-2025 12:01:47 AM

రష్మిక మందన్న, దీక్షిత్‌శెట్టి జంటగా నటించిన సినిమా ‘ది గర్ల్‌ఫ్రెండ్’. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో గీతాఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో విశేష ప్రేక్షకాదరణను చూరగొంటోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటుచేయగా, హీరో విజయ్ దేవరకొండ ముఖ్యఅతిథిగా విచ్చేశారు.

ఈ కార్యక్రమంలో హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. “ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమా చూస్తున్నంత సేపు భావోద్వేగానికి గురయ్యా. కొన్నిసార్లు కన్నీళ్లు ఆపుకోలేకపోయా. సమాజంలో మహిళలు ఇలాంటి సమస్యలు ఎదుర్కోవడం బాధాకరం. రిలేషన్‌షిప్స్ అంటే ఒకనొకరు గౌరవించుకోవాలి. ఒడిదొడుకుల్లో తోడుండాలి. పరస్పరం ఎదిగేలా సహకరించుకోవాలి. మీ రిలేషన్స్‌లో సమస్యలు ఉంటే ఓపెన్‌గా మాట్లాడుకోవాలి. ఈ సినిమా కొంతమందికి ఆ అవేర్‌నెస్ ఇస్తుంది. చెప్పినా మీ భాగస్వామి మీ మాట వినకుంటే అప్పుడు నిర్ణయం తీసుకోండి. మీకు ఏది సరైనదో ఆలోచించుకోండి. రెగ్యులర్ సినిమా ఫార్మేట్ లెక్కలు వేసుకోకుండా సొసైటీలో ఉన్న ఇష్యూ నేపథ్యంగా రూపొందించిన “ది గర్ల్ ఫ్రెండ్‌” సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకోవడం మామూలు విషయం కాదు. ఈ బాక్సాఫీస్ నెంబర్స్ కంటే ఈ సినిమా ప్రేక్షకుల్లో ఒక ఆలోచన కలిగేలా చేసింది, అవగాహన కల్పిస్తోంది. మహిళలు బయటకు వచ్చి మాట్లాడే స్ఫూర్తిని భూమా కలిగించింది. ఈ కథలో చెప్పినవి నా లైఫ్‌లో ఫేస్ చేయలేదు. కానీ విన్నాను, విన్న నాకే ఇంత ఎమోషనల్‌గా ఉంటే ఆ బాధను అనుభవించేవారికి ఎలా ఉంటుంది. రాహుల్ లాంటి డైరెక్టర్ ఈ ప్రపంచానికి కావాలి. రాహుల్‌కు దగ్గరగా ఉన్న వాళ్లంతా ఆయన గురించి ఎంతో ప్రేమగా మాట్లాడుతుంటారు. ఇలా అందరి ప్రేమను పొందడం రాహుల్ అదృష్టం. గీత గోవిందం నుంచి రష్మికను చూస్తున్నా. ఆమెకు భూమాకు చాలా పోలికలు ఉన్నాయి. తన కెరీర్ పీక్‌లో ఉన్న ఈ టైమ్‌లో ‘ది గర్ల్‌ఫ్రెండ్’ లాంటి కథను నేను చెప్పాలని ముందుకొచ్చింది. రష్మిక కెరీర్, సక్సెస్ చూస్తుంటే హ్యాపీగా, గర్వంగా ఉంది. నన్ను ఎవరైనా ఏదైనా అంటే ఎదురెళ్తా, కానీ రష్మిక ఓపికగా ఉంటుంది. నువ్వేంటో ఒకరోజు ప్రపంచం తెలుసుకుంటుంది. మన భాగస్వామిని సంతోషంగా ఉండేలా చూసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. ‘ది గర్ల్ ఫ్రెండ్’ టీమ్ అందరికీ కంగ్రాట్స్‌” అన్నారు. 

ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మాట్లాడుతూ.. “ఈ సినిమాకు హీరో మా డైరెక్టర్ రాహుల్. రాహుల్ లాంటి మంచి మనసున్న దర్శకుడే ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి చిత్రాన్ని రూపొందించగలడు. ఈ సినిమాకు అమ్మాయిలతోపాటు అబ్బాయిలూ బాగా కనెక్ట్ అవుతారని రాహుల్ మాతో చెప్పేవాడు. అతని అంచనా సినిమా రిలీజ్ అయ్యాక నిజమయ్యింది. మా ‘గీత గోవిందం’లో నటించిన రష్మిక ‘ది గర్ల్‌ఫ్రెండ్’తో మా సంస్థకు వన్నె తీసుకొచ్చింది. దీక్షిత్ మంచి నటుడు. ఆయన పర్‌ఫార్మెన్స్‌ను మరిన్ని చిత్రాల్లో చూడబోతున్నాం. విజయ్ మేము ఏ ఈవెంట్‌కు పిలిచినా గెస్ట్‌గా వస్తుంటాడు. అందుకు అతనికి థ్యాంక్స్‌” అన్నారు.

హీరోయిన్ రష్మిక మందన్న మాట్లాడుతూ.. “ది గర్ల్‌ఫ్రెండ్’ స్క్రిప్ట్ చదివిన తర్వాత ఈ సినిమా వీలైనంత త్వరగా చేయాలనుకున్నా. సినిమాలో నటిస్తున్నప్పుడు రాహుల్ ఒక ఉమెన్ ఎమోషన్‌ను ఇంత బాగా ఎలా అర్థం చేసుకున్నాడనిపించింది. భావోద్వేగంతో కొన్నిసార్లు షూటింగ్ కాసేపు ఆపేసేవాళ్లం. రాహుల్‌ను కంప్లీట్‌గా నమ్మి భూమా పాత్రలో నటించాను. భూమా లైఫ్‌లో జరిగినవి కొన్ని నా జీవితంలోనూ చూశాను. నేనే తప్పు చేస్తున్నానేమో అనిపించేది. మా సినిమాను థియేటర్లలో చూస్తూ చాలా మంది మహిళలు రిలీఫ్ అయినట్లు, ఫ్రీడమ్ వచ్చినట్లు ఫీల్ అవుతున్నారు. మా సినిమాకు, ఈ సినిమా మేము చేయడం వెనక ఉన్న ఉద్దేశం ప్రేక్షకులు బాగా అర్థం చేసుకున్నారు. భూమా పాత్రకు మీరు కనెక్ట్ కావడమే, ఈ పాత్రపై మీరు చూపిస్తున్న అభిమానం అన్ని పురస్కారాల కంటే ఎక్కువ. ఈ సంతోషం ఒకవైపు ఉన్నా, మన సొసైటీలో ఇంతమంది అమ్మాయిలు భూమాలా సమస్యలు ఎదుర్కొంటున్నారా అని చూస్తుంటే బాధగా అనిపిస్తోంది. డైరెక్టర్ రాహుల్‌ను చూస్తుంటే గర్వంగా ఉంది. దీక్షిత్ నటుడిగా ఒక జెమ్ అనుకోవచ్చు. ఈ సినిమాలో మొదటి నుంచి విజయ్ భాగమయ్యారు. మా మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో విజయ్ పాల్గొనడం హ్యాపీగా ఉంది. విజయ్ లాంటి వ్యక్తి ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటే అదొక బ్లెస్సింగ్ అనుకోవాలి” అన్నారు. 

హీరో దీక్షిత్‌శెట్టి మాట్లాడుతూ.. “ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమా చూసిన వాళ్లు నన్ను ఐ హేట్ యూ అంటున్నారు. ఆ ద్వేషించడంలోనూ ఎంతో ప్రేమను ఫీల్ అవుతున్నా. ఎంటర్‌టైన్‌మెంట్ కోసం సినిమాలు చేస్తుంటాం కానీ ఒక బాధ్యతగా భావించి ఈ చిత్రంలో నటించాను. ఈ సినిమా చూశాక రష్మికను ఎంతోమంది అమ్మాయిలు స్ఫూర్తిగా తీసుకుంటున్నారు. భూమాలా ధైర్యంగా ముందడుగు వేయాలనుకుంటున్నారు” అన్నారు. 

డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ.. “నా గత సినిమా రిలీజై ఆరేళ్లయింది. ‘ది గర్ల్‌ఫ్రెండ్’ చేస్తున్నప్పుడు ఈ సినిమా ఫలితం అనుకున్నట్లు రాకుంటే నా పరిస్థితి, నా ఫ్యామిలీ పరిస్థితి ఏంటని భయపడ్డాను. కానీ సినిమా చూశాక నా ఫ్యామిలీ మెంబర్స్ గర్వపడుతున్నారు. థియేటరల్లో మూడొంతుల ప్రేక్షకులు మహిళలే ఉంటున్నారు. మా ప్రొడ్యూసర్స్ విద్య, ధీరజ్ ఈ స్క్రిప్ట్‌ను ఎంతో నమ్మారు. అరవింద్ లేకుంటే ఈ సినిమా ఉండేది కాదు. నేను ఎప్పుడైనా కాన్ఫిడెన్స్ కోల్పోయినా రశ్మికకు ఈ స్క్రిప్ట్ మీద ఉన్న నమ్మకం చూసి నాకు ధైర్యం వచ్చేది. రష్మిక, దీక్షిత్ లాంటి నటులుంటే మాములు సినిమా కూడా అద్భుతంగా ఆదరణ పొందుతుంది. ‘ది గర్ల్ ఫ్రెండ్’ టీజర్‌కు తన వాయిస్ ఇవ్వడంతో ఒక క్రేజ్ తీసుకొచ్చారు విజయ్. ఆయనకు థ్యాంక్స్ చెబుతున్నా” అన్నారు.

నిర్మాత విద్య కొప్పినీడి మాట్లాడుతూ.. “ది గర్ల్‌ఫ్రెండ్’ నిర్మిస్తున్న టైమ్‌లోనే మేమొక పవర్ ఫుల్ మూవీ చేస్తున్నామని తెలుసు. మహిళల ఎమోషన్స్ రాహుల్ ఎంతో బాగా అర్థం చేసుకున్నారు. దీక్షిత్ నటన చూసి మా స్నేహితులు చాలా మంది ప్రశంసించారు. భూమా పాత్రతో రష్మిక ఎంతోమంది మహిళలకు స్ఫూర్తిగా నిలిచారు. భూమాను చూశాక మహిళలు తమకు స్వాతంత్య్రం వచ్చినట్లు భావిస్తున్నారు” అన్నారు. 

మరో నిర్మాత ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ.. “ది గర్ల్‌ఫ్రెండ్’ను నిర్మించినందుకు గర్వపడుతున్నా. ఇంకెన్ని చిత్రాలు చేసినా నాకు ఈ సినిమా తీసుకొచ్చిన గౌరవం రాదు. ప్రేక్షకుల ప్రశంసలతో ఒక జాతీయ అవార్డ్ పొందినంత సంతోషంగా ఉంది. రష్మిక లేకుంటే ఈ సినిమా లేదు. దర్శకుడు రాహుల్‌కు ఎన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువే. నా మిత్రుడు ఎస్‌కేఎన్ కూడా మొదట ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామి అయ్యారు. కానీ, ఇలాంటి మంచి చిత్రంతో నిర్మాతగా నాకు గుర్తింపు రావాలని ఆయన తప్పుకున్నారు. ‘ది గర్ల్‌ఫ్రెండ్’ సక్సెస్ మా టీమ్ అందరిది” అన్నారు.

అతిథిగా విచ్చేసిన డైరెక్టర్ సాయిరాజేశ్ మాట్లాడుతూ.. “ది గర్ల్‌ఫ్రెండ్’ను రిలీజ్‌కు ముందే చూశాను. హార్ట్ టచింగ్‌గా అనిపించింది. బేబి సినిమా రిలీజ్ అయ్యాక విమర్శలు వచ్చాయి. కొన్నాళ్లు ఆ చిత్ర విజయాన్ని ఎంజాయ్ చేయలేకపోయా. ఎంత వివరణ ఇచ్చుకున్నా విమర్శలు ఆగలేదు. అప్పుడు రాహుల్ నాతో మాట్లాడి బేబి సినిమాలో నేను ఎక్కడ తప్పులు చేశానో చెప్పారు. తెలుగులో చేసిన మిస్టేక్స్ హిందీ బేబి రీమేక్‌లో లేకుండా చూసుకున్నాను. రాహుల్ లాంటి దర్శకుడిని ఇండస్ట్రీ, నటీనటులు కాపాడుకోవాలి” అన్నారు.

మరో అతిథి, ప్రొడ్యూసర్ బన్నీ వాస్ మాట్లాడుతూ.. “ఏ సినిమా టీమ్‌లోనైనా ఆ ప్రాజెక్ట్‌ను 200 శాతం నమ్మేవారు ఒకరుంటారు. ‘ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమాకు ఆ ఒక్కరు డైరెక్టర్ రాహుల్. ఆయన విజన్‌ను మిగతా టీమ్ అంతా నమ్మారు” అన్నారు.

నటి రోహిణి, సంగీత దర్శకులు ప్రశాంత్ విహారి, హేషమ్ అబ్దుల్ వహాబ్, గీత రచయిత రాకేందు మౌళి, కాస్ట్యూమ్ డిజైనర్ శ్రావ్య వర్మ, మిగతా చిత్రబృందం పాల్గొన్నారు.