27-05-2025 12:00:00 AM
భద్రాచలం, మే 26(విజయక్రాంతి): ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని గిరిజన సంక్షేమ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ కళాశాలలలో 2025-26 విద్యా సంవత్సరానికి గాను మొదటి సంవత్సరం జూనియర్ ఇంటర్ 302 సీట్ల భర్తీ కొరకు సోమవారం స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహించినట్లు భద్రాచలం ఈ ఎం ఆర్ ఎస్ కళాశాల ప్రిన్సిపాల్ వందనాబీ దాస్ తెలిపారు.
భద్రాచలం ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ కళాశాలలో భద్రాచలం ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి బి.రాహుల్ ఆదేశాను సారం ఈ ఎం ఆర్ ఎస్ కళాశాలల కన్వీనర్ నాగేశ్వరరావు, ఆర్.సి.ఓ అరుణ కుమారి ఆధ్వర్యంలో వివిధ కోర్సులకు విద్యార్థిని,విద్యార్థులు 302 సీట్లకు గాను 577 మంది విద్యార్థినీ, విద్యార్థులు తమ తల్లిదండ్రులతో స్పాట్ కౌన్సిలింగ్ కు హాజరయ్యారు.
ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఖాళీగా ఉన్న 302 సీట్లను మెరిట్ ప్రకారము విద్యార్థినీ విద్యార్థులను పిలిచి వారు ఎంపిక చేసుకున్న ఈ ఎం ఆర్ ఎస్ కళాశాలలో ఎంచుకున్న గ్రూపుల ప్రకారము పారదర్శకంగా కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేయడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో విజయ్ కుమార్( ములకలపల్లి), సంజయ్ మల్కర్ (గండుగులపల్లి), ప్రశాంత్ జిత్ (పాల్వంచ), నితిన్ సింగ్ (గుండాల), విజయేంద్ర సింగ్ (దుమ్ముగూడెం) ఈఎంఆర్ ఎస్ కళాశాలల ప్రిన్సిపాల్ లు, వివిధ కళాశాలల లెక్చరర్స్, ఉపాధ్యాయులు,తదితరులు పాల్గొన్నారు.