calender_icon.png 3 July, 2025 | 8:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మధ్యతరగతికి శుభవార్త

03-07-2025 01:54:15 AM

  1. జీఎస్టీ తగ్గింపు యోచనలో కేంద్ర ప్రభుత్వం
  2. నిత్యావసర వస్తువులపై 12% శ్లాబు తొలగింపు లేదా 5 శాతానికి కుదింపు
  3. టూత్‌పేస్ట్, వంట సామగ్రి, బట్టలు ఇతర వస్తువుల చౌకగా దొరికే అవకాశం
  4. ఈ నెలాఖరున 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం

న్యూఢిల్లీ, జూలై 2: ఆదాయపన్నులో రాయితీలతో వేతన జీవులకు కొంత ఊరట కల్పించిన కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు మధ్యతరగతి, పేద ప్రజలకు మరో శుభవార్త చెప్పేందుకు సిద్ధమవుతోంది. నిత్యావసరాల వస్తువులపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) భారాన్ని  తగ్గించేందుకు కేంద్రం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం 12 శాతం పన్ను శ్లాబును పూర్తిగా తొలగించడం లేదా ఈ శ్లాబ్‌లోని పలు వస్తువులను 5 శాతం శ్లాబులోకి మార్చడం వంటి ప్రతిపాదనలను పరిశీలిస్తోంది.

ఈ మార్పుల వల్ల ప్రభుత్వ ఖజానాపై సుమారు రూ. 40వేల నుంచి 50 వేల కోట్ల భారం పడొచ్చని అంచనా. ఈ నెలాఖరులో జరగనున్న 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చే అవకాశముందని సంబంధితవర్గాలు తెలిపాయి. జీఎస్టీకి సంబంధించిన ఏ మార్పులకైనా జీఎస్టీ కౌన్సిల్ ఆమోదం తప్పనిసరి. కౌన్సిల్‌లో అన్ని రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదిరితేనే సామాన్యుడికి ఊరట దక్కనుంది.

ఒకవేళ కేంద్రం జీఎస్టీలో మార్పులు తీసుకువస్తే నిత్యావసర వస్తువులు భారీగా తగ్గే అవకాశముంది. ఈ నిర్ణయం అమలైతే టూత్‌పేస్ట్, కుక్కర్లు, గీజర్లు, సైకిళ్లు, చెప్పులు, బట్టలు, ఇతర అనేక వస్తువుల ధరలు గణనీయంగా తగ్గుతాయి. అయితే ఈ ప్రతిపాదనకు పంజాబ్, కేరళ, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్టు తెలుస్తోంది. 

జీఎస్టీ మార్పులతో ధరలు తగ్గనున్న వస్తువులు ఇవే..

1) టూత్ పేస్ట్, టూత్ పౌడర్, సబ్బులు, కొబ్బరి నూనె

2) గొడుగులు    

3) కుట్టు మిషన్లు

4) ప్రెషర్ కుక్కర్, ఇతర వంట సామాన్లు   5) ఐరన్ బాక్సులు

6) గీజర్లు, తక్కువ సామర్థ్యం కలిగిన వాషింగ్ మిషన్లు

7) సైకిల్లు

8) వెయ్యి రూపాయల పైన ధర ఉన్న రెడిమేడ్ బట్టలు

9) 500 నుంచి వెయ్యి రూపాయల మధ్య ధర ఉన్న చెప్పులు

10) స్టేషనరీ ఐటమ్స్

11) వ్యాక్సిన్లు, ఆయుర్వేదం, యునానీ మందులు

12) డయాగ్నస్టిక్ కిట్స్ (హెచ్‌ఐవీ, హెపటైటిస్, టీబీ)

13) సిరామిక్ టైల్స్, రెడీ మిక్స్ కాంక్రీట్

14) వ్యవసాయ పరికరాలు

15) సోలార్ వాటర్ హీటర్స్, వాటర్ ఫిల్టర్స్, ఫ్యూరిఫయర్స్

16) సానిటరీ న్యాప్‌కిన్స్, వాక్యూమ్ క్లీనర్స్